విజయవాడ సెంట్రల్ టికెట్ వ్యహారంలో పార్టీ అధీష్టానం తీరుపై ఆగ్రహంతో ఉన్న వైసీపీ నేత వంగవీటి రాధా..రాజీనామాకు సిద్ధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆయన కాస్త డైలామాలో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వాస్తవానికి వంగవీటి రాధా .. నిన్న సాయంత్రానికి డెడ్ లైన్ ఇచ్చారు. పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు అందకపోవడంతో ఆయన అనుచరులు రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తన సన్నిహితులు, అనుచరులతో రాధా సమావేశమై తన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అధిష్టానం నిర్ణయం కోసం మరో మూడు రోజులు ఓపిక పడదామని వంగవీటి రాధా తన అనుచరులకు సూచించారు. హైకమాండ్ తో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని తెలిపారు.
విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం వంగవీటి రాధా పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో వైసీపీ చీఫ్ జగన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై రాధా మనస్థాపానికి గురయ్యారు. ఇదే సందర్భంలో విజయవాడ సెంట్రల్ పరిధిలోని ' గడప గడపు వైసీపీ' కార్యక్రమ బాధ్యతలను మల్లాది విష్ణుకు అప్పగించడంతో వ్యవహారం పుండి మీద కారం చల్లినట్లుగా మారింది. వంగవీటి రాధాకు ఈ పరిణామం మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఈ విషయంలో నిన్న ఆందోళన చేపట్టిన రాధా.. పార్టీ వీడాలని డిసైడ్ అయ్యారు. అధిష్టానం నుంచి పాజిటివ్ సంకేతాలు వస్తాయని ఆశతో ఉన్న రాధా..తాను ఇచ్చిన డెడ్ లైన్ మరో మూడు రోజుల పాటు పొడిగించారు.