Kishan Reddy On CM KCR: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే పార్టీ బీజేపీనేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా ప్రజల పోరాటం మరువలేనిదన్నారు. ఉద్యమంలో కేసీఆర్ చేసిన దీక్షను బట్టబయలు చేసింది ఖమ్మం ప్రజలేనని అన్నారు. ఖమ్మం జిల్లాలో రానున్న రోజుల్లో అనేక మార్పులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు.. ఒకసారి కాంగ్రెస్తో ఇంకోసారి వేరే పార్టీతో కలిసి అస్తిత్వం కోసం పాకులాడుతున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
"చట్టసభల్లో అడుగు పెట్టాలంటే ఏదో ఒక పార్టీతో కలవాల్సిన అవకాశవాద రాజకీయాలు వాళ్లవి. ఎవరిపైన పోరాటం చేయాలో.. వాళ్లపై చేయకుండా.. వ్యక్తిగత లబ్ధి కోసం రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ విచక్షణా రహితంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నది. చివరకు కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉంటే.. ఆయనతో రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకుంది. దీనిపై కమ్యూనిస్టు పార్టీ క్యాడర్.. పార్టీ పెద్దలను నిలదీయాలి.
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈరోజు రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన, పెత్తనం, ఆధిపత్యం ఉంది. ఒక కుటుంబ అహంకారం రాష్ట్రాన్ని పాలిస్తుంది. దీన్ని ఖమ్మం ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గద్దె దిగడం ఒక్కటే కాదు.. మౌలిక మార్పులు రావాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. అనేకసార్లు అవి పొత్తు పెట్టుకున్నాయి. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే.. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. ఇటీవల బీఆర్ఎస్ మంత్రి మాట్లాడుతూ.. మేము కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని అన్నాడు. ఇది పగటికలే అయినప్పటికీ.. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష కూటమితో వాళ్లు కలుస్తారనేది అర్థం అవుతోంది.
కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే.. ఎన్నికల ముందు లేదా.. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్తో కలుస్తారు. ఈ రెండు పార్టీలు ఒకే గూటి పక్షులు. కుటుంబ, అవినీతి, అప్రజాస్వామి పోవాలనుకునే సమాజం ఆలోచించాలి. గతంలో కాంగ్రెస్, ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీల పాలన చూశాం.. కాబట్టి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. బీజేపీ మాత్రమే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చగలదు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా విస్మరించిందో చూస్తున్నాం. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంతో రైతుల రుణాలు మాఫీగాక.. రైతులు డీఫాల్టర్లుగా మారారు. బ్యాంకులో రైతు రుణాల వడ్డీలు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వం తూతూ మంత్రంగా రుణమాఫీ చేస్తున్నది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అతీగతీ లేదు. అవి పేదవారికి అందని ద్రాక్షలా మారాయి." అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో 4 కోట్ల ఇండ్లు కట్టిన ప్రధాని, మరో 2 కోట్ల ఇండ్లు కట్టాలని నిర్ణయించిందని కిషన్ రెడ్డి అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. కేంద్రం నిధులు ఇస్తామన్నా పేదలకు ఇండ్లు కట్టడం లేదని ఫైర్ అయ్యారు. అబద్ధాలు, అవినీతికి, మోసాలకు కేరాఫ్ అడ్రస్ కల్వకుంట్ల కుటుంబం. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురై, కళావిహీనంగా మారాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే ఎవరి సాయం లేకుండా నిర్మాణం చేస్తుందని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. దాన్ని ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. దేశంలో అత్యంత అవినీతి పార్టీ ఏదని చూస్తే.. కల్వకుంట్ల కుటుంబ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీ అని తేలుతుందని అన్నారు.