Kidney Problems: శరీరంలో కొన్ని అవయవాలకు ప్రాధాన్యత ఎక్కువ. అవయవాల పనితీరుని బట్టి ఆరోగ్యం ఉంటుంది. కొన్ని అవయవాల పనితీరు సక్రమంగా లేకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అలాంటి అవయవాల్లో కీలకమైనవి కిడ్నీలు.
కిడ్నీలు శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలు. ఎందుకంటే రక్తంలో చేరే వ్యర్ధ లేదా విష పదార్ధాలను వడపోసి శుభ్రం చేయడం కిడ్నీల పని. కిడ్నీలు ఏ మాత్రం విరామం లేకుండా రక్తాన్ని శుభ్రం చేస్తుంటాయి. రక్తంలో ఎక్కువగా ఉండే నీటిని, విష పదార్ధాలను ఎప్పటి కప్పుడు వడకడుతూ ఉంటాయి. ఆరోగ్యవంతుడైన మనిషి శరీరంలో రోజుకు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా. ఇది సక్రమంగా జరిగినంతవరకూ ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. ఈ పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా మూత్రపిండాల ఆరోగ్యంలో ఎక్కడో సమస్య ఉన్నట్టు అర్ధం చేసుకోవాలి.
కిడ్నీ సమస్యల్లో ఎన్ని దశలుంటాయి
మూత్ర పిండాల సమస్యలో ఐదు దశలుంటాయి. మొదటి, రెండవ దశలో వ్యాధి లక్షణాలు కన్పించవు. మూడవ దశ నుంచి లక్షణాలు బయటపడుతుంటాయి. ఆకలి మందగించడం, నీరసం, ముఖం వాచినట్టుండటం, కాళ్లలో వాపు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇక నాలుగు, ఐదవ దశల్లో కంటి చుట్టూ వాపు, మూత్రం ఆగిపోతుండటం, మూత్రంలో మంట, ఫిట్స్, నడుము నొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇక చివరి ఐదవ దశలో మూత్ర పిండాల్ని సాధారణ స్థితికి తీసుకురావడం అసాధ్యం. అందుకే మూత్ర పిండాల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మూత్ర పిండాల సమస్య లక్షణాలు
మూత్ర పిండాల సమస్య ఉంటే లక్షణాలు చాలా సూక్ష్మంగా కన్పించకుండా ఉంటాయి. ఇవి తీవ్రమైతే తప్ప బయటపడవు. అందుకే చాలామంది కిడ్నీ వ్యాధి బారినపడుతుంటారు. నీరసం, బలహీనత అనేవి సాధారణ లక్షణాలతో పాటు మూత్రపిండాల సమస్యల్లో కూడా ఇవే లక్షణాలుంటాయి. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటే విటమిన్ డి సంగ్రహణ బాగుండి..ఎముకలు పటిష్టంగా మారడమే కాకుండా ఎరిత్రోపాయెటిన్ హార్మోన్ విడుదలవుతుంది. అదే కిడ్నీ సమస్య ఉంటే మాత్రం ఈ హార్మోన్ ఉత్పత్తి కాదు. ఫలితంగా రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి తగ్గి..కండరాలు, మెదడు బలహీనమౌతాయి. రుచి కోల్పోవడం మరో ప్రధాన లక్షణం. రక్తంలో మలినాలు పేరుకున్నప్పుడు నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ పనితీరు తగ్గిపోతుంది. దాంతో రుచి గుర్తించడం కష్టమౌతుంది. శరీరం నుంచ వెలువడే శ్వాసలో దుర్వాసన ఉంటుంది. పాదాలు, చేతుల్లో వాపు ఉంటుంది. చీలమండల వద్ద వాపు కన్పిస్తుంది.
ఇంకా చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కళ్లు ఉబ్బినట్టుండటం చూడవచ్చు. ఎందుకంటే మూత్రం అధికమైనప్పుడు శరీరంలోని ప్రోటీన్లు యూరిన్ ద్వారా బయటకు పోతాయి దాంతో కళ్లు ఉబ్బుతాయి. నిద్రలేమి, కూడా ఓ లక్షణమే. చర్మం పొడిబారి కన్పిస్తుంది. ఎందుకంటే కిడ్నీ సమస్య ఉన్నప్పుడు శరీరంలో లవణాలు తగినంతగా లేకపోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
ఇవి కాకుండా మూత్రంలో మంట, మూత్రం రంగు మారడం, అధిక రక్తపోటు వంటి లక్షణాలతో కిడ్నీ సమస్యలను గుర్తించవచ్చు. సకాలంలో మూత్ర పిండాల సమస్య లక్షణాలను గుర్తించి చికిత్స చేయించుకుంటే కిడ్నీలను కాపాడుకోవచ్చు. లేకపోతే సమస్యలు ఎదురౌతాయి.
Also read: Green Tea: గ్రీన్ టీ ప్రయోజనాలేంటి, ఎప్పుడెప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook