Heavy Rains in Telangana: కామారెడ్డి జిల్లాల్లోని జుక్కల్ మండలం కౌలాస్ నాలా ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరుతుండడంతో కౌలస్ నాల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు జలకళతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వరద నీటి ఉదృతి పెరిగితే ఏ క్షణంలో నైనా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడప్గల్ మండలాలకు వరప్రదాయని అయిన కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌లోకి మంగళవారం 577 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండగా నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 458.00 మీటర్లు కాగా ప్రస్తుతం 456.95 మీటర్లుకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 1.237 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.994. టీఎంసీలకు చేరుకుంది. ఇలాగే ఎడతెరపి లేకుండా వర్షం కురిస్తే ఏ క్షణానైనా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా
ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో వరద తాకిడికి గురైన ప్రాంతాలను మంగళవారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సందర్శించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితి తీవ్రతను పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వస్థలమైన వేల్పూరులో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో కేవలం ఆరు గంటల వ్యవధిలోనే 46.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో వర్ష తాకిడికి లోనై కట్టలు తెగి గండ్లు పడిన మర్సుకుంట చెరువు, కాడి చెరువులను, తెగిపోయిన ప్రధాన రహదారులు, జలమయంగా మారిన వేల్పూర్ పోలీస్ స్టేషన్, నివాస ప్రాంతాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేల్పూర్ మండలం జానకంపేట్ చెరువు, పచ్చలనడకూడలోనూ తెగిన చెరువు, కొట్టుకుపోయిన బీ.టీ రోడ్డును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక మేటలు వేసిన పంటలను పరిశీలించి, అధైర్యపడవద్దు... అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన వసతి కల్పించాలని, శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసిస్తున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం ఎనిమిది చోట్ల అత్యధిక వర్షం కురిసి రెడ్ జోన్ ప్రాంతాలుగా ప్రకటించగా, వాటిలో నిజామాబాద్ జిల్లాలోనే ఐదు ప్రాంతాలు పెర్కిట్, వేల్పూర్, భీంగల్, కోనసముందర్, జక్రాన్పల్లి ఉన్నాయని తెలిపారు. వీటిలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ సెగ్మెంట్ లోని మూడు ప్రాంతాలు వరద తాకిడికి లోనయ్యాయని, అత్యధికంగా రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఆరు గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వేల్పూర్ లో 46.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని అన్నారు.
కుండపోత వర్షం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, అక్కడక్కడ ఇసుకమేటలు వేసి పంటలు దెబ్బతినడం బాధ కలిగించిందన్నారు. తెగిన రోడ్లు, గండ్లు పడిన చెరువులను ప్రభుత్వపరంగా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. భారీ వర్షాల నేపధ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందని, ప్రజలెవరూ భయాందోళనకు గురి కావద్దని, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశామన్నారు. గ్రామాభివృద్ది కమిటీలు కూడా వర్ష పరిస్థితిని గమనిస్తూ, ఎక్కడైనా చెరువులు, కుంటలు తెగి, రోడ్లు కొట్టుకుపోతే తక్షణ చర్యలు చేపట్టాలని, అధికారులకు సమాచారం అందించాలని మంత్రి కోరారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ హెచ్చరికలు చేసినందున రైతులు, ప్రజలెవరూ చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లవద్దని హితవు పలికారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టేలా అధికారులను సన్నద్ధం చేశామన్నారు. ఇరిగేషన్, ట్రాన్స్కో, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. శిథిలావస్థ భవనాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
అత్యవసర సేవల నిమిత్తం ప్రజల సౌకర్యార్థం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూమ్ నం.9490534721, 9640378197 ఏర్పాటు చేయడం జరిగిందని, ఏదైనా అత్యవసర సేవల కొరకు ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలోని ప్రాణహిత నదితో పాటు పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తున్నందున అధికార యంత్రాంగం ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతుందని, ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని కోరారు.
ఖమ్మం జిల్లా
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది.. వర్షాల ప్రభావంతో చెరువులు, కుంటలలోకి వరదనీరు చేరుకుంటోంది. జిల్లాలోని పలు ప్రాంతాలలో చెరువులు అలుగులు పారుతున్నాయి. వైరా, పాలేరు జలాశయాలు ఇప్పటికే నిండిపోయాయి. పాలేరు జలాశయంలో మొన్నటి వరకు వెలవెలపోగా నేడు జలకళను సంతరించుకుంది. ఆకేరువాగు పొంగడంతో ఖమ్మం రూరల్ మండలం తీర్థాల, మంగళగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిపోవడంతో ఆ ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఆలస్యంగా వచ్చినా సాగుకు సరిపడ రావడంతో ఇబ్బందిలేదని చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, కోయగూడెం ఓపెన్‌కాస్ట్ గనుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో కోయగూడెం ఓసీలలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 27 వేల టన్నుల బొగ్గుఉత్పత్తికి ఆటంకంగా మారింది. ఇటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులకు భారీగా నీరు చేరడంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇటు భద్రాచలం వద్దా గోదావరి తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అధికారులు మాత్రం మరల గోదావరి పెరిగే అవకాశం ఉందంటున్నారు.
కిన్నెరసాని 2 గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తింది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం గల ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం 1000 క్యూసెక్కుల వరద రావడంతో నీటిమట్టం 402.70 అడుగులకు పెరిగింది. దీంతో 2 గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. నీటి విడుదలతో రాజాపురం, యానంబైల్ గ్రామాల మధ్య చప్టాపై ఉధృతంగా ప్రవహించగా 24 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వరంగల్ జిల్లా
గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వరంగల్ హంటర్ రోడ్ లోని ఎన్. టి. ఆర్, కాలనీ, సాయినగర్ కాలనీ, సంతోషమాత కాలనీ బృందావన్ లలో పూర్తిగా వరద నీరు రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ స్థానిక పోలీస్ అధికారులతో కల్సి ట్రాక్టర్‌లో ప్రయాణించి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారు. కాలనీల్లో వరద నీరు చేరుకోవడంతో ఈ కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు తీరుపై పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
హంటర్ రోడ్డులోని ఎన్. టి. ఆర్, కాలనీ, సాయినగర్ కాలనీ, సంతోషిమాత కాలనీ బృందావన్‌లలో పెద్ద స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో పోలీస్ కమిషనర్, జిల్లా కలేక్టర్ ఆదేశాల మేరకు మట్టేవాడ పోలీసులు వరంగల్ ఏ. సి. పి కిషన్, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సంయుక్తంగా కలిసి లోతట్టులోని ప్రాంతాల్లోని ప్రజలను బొట్లు ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇది కూాడా చదవండి : Telangana, AP Rains News Live Updates: తెలంగాణ, ఏపీలో ఈ మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇదిలావుంటే, మరోవైపు వరంగల్ జిల్లాలో నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ - ఖమ్మం హైవేపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. పంతిని గ్రామం వద్ద హైవేపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద నీటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లిన లారీ అందులో చిక్కుకుపోయింది. లారీని బయటికి తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. దీంతో హైవేపై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
ఇది కూాడా చదవండి : Holidays For Schools and Colleges: అన్ని స్కూల్స్, కాలేజీలకు రేపు, ఎల్లుండి సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి