Honda Dio H Smart Features: ఇటీవల కాలంలో వస్తోన్న బైక్స్, స్కూటర్స్లో ఎప్పటికప్పుడు ఏదో ఒక బెస్ట్ ఫీచర్స్ యాడ్ అవుతున్న విషయం తెలిసిందే. మార్కెట్లో ఉన్న గట్టి పోటీని తట్టుకుని నిలబడేందుకు తమని తాము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకుపోతున్న హోండా టూ వీలర్స్ కంపెనీ తాజాగా హోండా డియో హెచ్ స్మార్ట్ పేరుతో మరో కొత్త స్కూటర్ ని లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.. ద్విచక్ర వాహానాల్లో కూడా కారు లాంటి ఫీచర్స్ ఉంటే ఇలా ఉంటుందా అన్నట్టుగా ఉంటుది.
ఇంధనం పరంగా సమర్థవంతమైన స్కూటర్ కావడంతో పాటు సేఫ్టీ పరంగా టైర్లు, చోరీ బారిన పడకుండా స్మార్ట్ కీ లాంటి ఫీచర్స్ ఈ హోండా డియో హెచ్ స్మార్ట్ స్కూటర్ సొంతం. అవును.. కన్ను మూసి తెరిచేలోగానే లాక్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలు కూడా చోరీకి గురవుతున్న రోజులు ఇవి. అందుకే హోండా డియో హెచ్ స్మార్ట్ స్కూటర్ కి స్మార్ట్ కీ అందిస్తున్నారు. ఇందులో యాంటీ - థెఫ్ట్ సిస్టమ్ అమర్చారు. ఈ స్మార్ట్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. స్కూటర్ యజమాని స్కూటర్ ని లాక్ చేసి 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లారంటే వెంటనే స్మార్ట్ లాక్ అవుతుంది. ఆ తరువాత వేరే వాళ్లు ఈ స్కూటర్ ని చోరీ చేయాలని చూసినా లాక్ ఓపెన్ అవదు. మళ్లీ యజమాని తన వద్ద ఉన్న స్మార్ట్ కీతో రిమోట్లో అన్ లాక్ చేస్తే తప్ప ఈ స్కూటర్ ని ఎవ్వరూ టచ్ చేయలేరు.
హోండా డియో హెచ్-స్మార్ట్ ధర విషయానికొస్తే.. హోండా టూ వీలర్స్ కంపెనీ ఈ స్కూటర్ బేస్ వేరియంట్ మోడల్ ధరను రూ.70,211 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించగా.. టాప్ ఎండ్ వేరియంట్ మోడల్ ధర రూ. 77,712 గా ఉంది.
ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే..
ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఫీచర్లకు మించి మరే ఇతక వివరాలు పెద్దగా వెల్లడించనప్పటికీ.. దీని ఫీచర్స్ కూడా యాక్టివా హెచ్-స్మార్ట్ మాదిరిగానే ఉండవచ్చని తెలుస్తోంది. స్కూటర్ హ్యాండిల్, ఫ్యూయల్ క్యాప్, సీటు కీ, ఇగ్నిషన్ను ఆన్ చేయడానికి రోటరీ నాబ్ను ప్రెస్ చేయడం, తిప్పడం లాంటివి చేయాల్సి ఉంటుంది. ఇంజిన్ స్టార్ట్ చేయాలనుకున్నా.. ఆఫ్ చేయాలనుకున్నా.. స్టార్ట్ / స్టాప్ స్విచ్ నొక్కాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కార్లలో వస్తున్న ఆన్, ఆఫ్ ఫీచర్ తరహాలోనే ఇది కూడా. ఇక హోండా డియో హెచ్-స్మార్ట్ ఇంజిన్, పవర్ విషయానికొస్తే... యాక్టివాకి అమర్చిన అదే 109.51 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్ డియో హెచ్-స్మార్ట్ ఇంజన్ దీనికి కూడా అమర్చారు. ఇది గరిష్టంగా 9 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.