ఆహార ఉత్పత్తి రంగానికి సంబంధించి ప్రపంచ స్థాయి సాంకేతిక వ్యవస్థని దేశ ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీలో "వరల్డ్ ఫుడ్ ఇండియా" సదస్సుని నిర్వహించబోతోంది ప్రభుత్వం. నవంబరు 3వ తేదీన ఉదయం 10 గంటలకు భారత ప్రధాని మోడీ ఈ సదస్సుని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన 20 దేశాల ఆహార నిపుణులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విదేశీ మీడియా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు కూడా పాల్గొంటారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ప్రకటనను జారీ చేసింది. దాదాపు 50 మంది గ్లోబల్ సీఈఓలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీసీఎండీ సురేష్ చిట్టూరి కూడా ఒకరు. ఇండియా గేట్ లాన్స్‌లో 40 వేల చదరపు మీటర్ల స్థలంలో ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక ఆహార ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు.