తమిళాన్ని ప్రేమించండి.. కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి: రజనీకాంత్

తమిళనాడులో డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసిన సినీ నటుడు రజనీకాంత్ ప్రసంగించారు.

Last Updated : Mar 6, 2018, 12:25 AM IST
తమిళాన్ని ప్రేమించండి.. కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి: రజనీకాంత్

తమిళనాడులో డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసిన సినీ నటుడు రజనీకాంత్ ప్రసంగించారు. రాజకీయాల్లోకి వస్తున్నాయని ప్రకటించాక... బయట వేదికలపై రజనీకాంత్ ప్రసంగించిన తొలి స్పీచ్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ ప్రసంగంలోని పలు విషయాలు మీకోసం

*"రాజకీయంలో మంచి నాయకుల లోటు ఉండడం వల్లే నేను రాజకీయాల్లోకి వస్తున్నానని పలువురు అన్నారు. అవును నిజమే.. నేడు తమిళనాడులో మంచి నాయకుల కొరత ఉంది. జయలలిత వంటి గొప్ప నాయకురాలిని మనం కోల్పోయాం. కరుణానిధి గారు కూడా అనారోగ్యంగా ఉన్నారు. వారి కొరతను తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను" అని రజనీకాంత్ అన్నారు. 

*"నా అభిమానులకు నేను చెప్పేది ఒకటే. మద్రాసు హైకోర్టు ఆర్డరు ఉంది కాబట్టి.. నా బ్యానర్లు ఎక్కడా కట్టవద్దు. మీకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాను"

*"ఎంజీఆర్ గారు అందించిన మంచి పాలనను నేను అందిస్తాను. ఆయన లాంటి పాలకులు మళ్లీ పుట్టబోరు. కానీ నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ప్రజలు, టెక్నాలజీ, సలహాదారుల సహాయంతో మంచి ప్రభుత్వాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను"

*"చాలామంది ఇప్పటికీ నేను చెప్పిన ఆధ్యాత్మిక రాజకీయం అనే అంశం గురించి పదే పదే అడుతున్నారు. అప్పుడూ చెబుతున్నాను.. ఇప్పుడూ చెబుతున్నాను. ఆధ్యాత్మిక రాజకీయాలంటే ధర్మం, నిజాయతీతో కూడిన కులరహిత రాజకీయాలు. దేవుడి పట్ల నమ్మకంతో, భయంతో కూడిన రాజకీయాలు"

*"చాలామంది రాజకీయ నాయకులు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. మొహానికి రంగులు వేసుకొనే సినీ హీరోలు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు అని అడుగుతున్నారు. దానికి  నా సమాధానం ఒకటే. మేము సినిమా నటులుగా మా బాధ్యతలు సరిగ్గానే నిర్వర్తించాం. కానీ నేటి రాజకీయ నాయకులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం లేదు. అందుకే ఆ బాధ్యతను తీసుకోవడానికి మేము రాజకీయాల్లోకి వస్తున్నాం"

*"విద్యార్థుల్లారా.. మీరు చదువుకొనేటప్పుడు రాజకీయ పార్టీల్లో జాయిన్ అవ్వద్దు. రాజకీయాల గురించి తెలుసుకోండి.. కానీ ఏ రాజకీయ పార్టీ బారిన పడద్దు. అంతెందుకు... నేను రాజకీయ పార్టీ పెట్టినా కూడా మీరు అందులో చేరకుండా ఉంటే మంచిది."

*"విద్యార్థుల్లారా.. మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్చుకోండి. చాలా మంది తమిళం నేర్చుకుంటూ ఆంగ్లాన్ని పక్కన పెడుతున్నారు. కానీ మనం ఆంగ్లం కూడా బాగా మాట్లాడగలగాలి. తమిళ భాషను ప్రేమిస్తూనే..మిగతా భాషలు కూడా నేర్చుకోవాలి. తమిళులు డెవలప్ అయినప్పుడే తమిళ భాష కూడా డెవలప్ అవుతుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, భారతరత్న అబ్దుల్ కలామ్ మనకు ఆదర్శం. తమిళ స్కూలు నుండి ఇంగ్లీష్ మీడియం స్కూలులోకి మారాక తాను భాష పరంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో కలామ్ స్వయంగా తన ఆత్మకథలో రాశారు. అందుకే తమిళుల సత్తా అంతర్జాతీయ స్థాయిలో చాటడానికి మనం ఆంగ్లం కూడా నేర్చుకోవాలి"

Trending News