Divorce vs Supreme Court: వివాహం కోలుకోలేని విఛ్చిన్నం అనే కారణాలతో విడాకులు మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం కల్గిస్తోంది.
విడాకులు, వివాహాల రద్దు అంశంపై దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పు వెల్లడించింది. భార్యాభర్తలు కలిసి బతకలేని పరిస్థితులున్నప్పుడు విడాకుల కోసం ఆరు నెలల ఎదురు చూడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇద్దరూ ఒప్పుకుంటే తక్షణం విడాకులు మంజూరు చేయవచ్చంటూ ఫాస్ట్‌ట్రాక్ విడాకులకు తెరతీసింది సుప్రీంకోర్టు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు విశిష్ట అధికారాలున్నాయని గుర్తు చేసింది న్యాయస్థానం.
ఈ కేసు ఎనిమిదేళ్ల నాటిది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు కోరుతూ శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ 2014లో దాఖలు చేసుకున్న కేసు ఇది. ఈ కేసులో అప్పటి డివిజన్ బెంచ్ న్యాయమూర్తులైన జస్టిస్ కీర్తి సింగ్, జస్టిస్ ఆర్ భానుమతిల ధర్మాసనానికి బదిలీ అయింది. సుదీర్ఘ వాదనల అనంతరం గత ఏడాది సెప్టెంబర్ నెలలో తీర్పు రిజర్వ్ చేసింది డివిజన్ బెంచ్. ఇవాళ ఈ కేసులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరిలు తీర్పు వెలువరించారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది
విడాకులు కోరుతున్న జంట మధ్య విభేదాలు పరిష్కారం కానప్పుడు సమస్యలు తీర్చలేనివిగా ఉన్నప్పుడు కలిసి జీవించలేని పరిస్థితి ఉంటుందని..ఆ పరిస్థితుల్లో వివాహ బంధాన్ని తక్షణం రద్దు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం విశిష్ట అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఈ తరహా కేసుల్లో ఇరువురి పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు విధించే ఆరు నెలల గడువు ప్రస్తావన ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 బి ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చు. కుటుంబ న్యాయస్థానాల్లో విడాకుల కోసం సుదీర్ఘ కాలం విచారణకు హాజరుకావల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఉపయోగిస్తూ ఫాస్ట్‌ట్రాక్ విడాకులకు తెరతీసింది. ఆర్టికల్ 142 అనేది ప్రాధమిక హక్కులకు వెలుగురేఖ లాంటిదని అభిప్రాయపడింది. అదే సమయంలో భరణం చెల్లింపు, పిల్లల హక్కులకు సంబంధించి ఈక్విటీలను ఎలా సమతుల్యం చేయాలో కూడా సుప్రీంకోర్టు వివరించింది.
షరతులకు లోబడి పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఇప్పటి వరకూ ఉన్న 6 నెలల నిరీక్షణ వ్యవధిని ఇకపై రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దంపతుల సమ్మతి ఉంటే తక్షణం విడాకులు మంజూరు చేయవచ్చని పేర్కొంది.
Also read: Jharkhand: జార్ఖండ్‌లో విషాదం.. పిడుగుపాటుకు నలుగురు చిన్నారులు మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook