ఢిల్లీ నుండి పట్నా వెళ్తున్న గో ఎయిర్ విమానంలో ఓ చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్‌లో పనిచేస్తున్న ఓ బ్యాంకు ఉద్యోగి తొలిసారిగా విమానం ఎక్కిన క్రమంలో.. నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అదే కారణంతో విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎగ్జిట్ డోర్ వద్దకు వెళ్లి దానిని లాగడానికి ప్రయత్నించాడు. దీంతో విస్తుపోయిన ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో.. సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు.
అయితే తనకు విమాన ప్రయాణం కొత్త అని.. వాష్ రూమ్ డోర్‌కి, ఎగ్జిట్ తలుపుకి తేడా తెలుసుకోలేకపోయానని ఆయన తెలిపాడు. విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే.. సిబ్బంది అతన్ని పోలీసులకు అప్పగించారు. వారికి కూడా సదరు వ్యక్తి అదే సమాధానం తెలిపాడు. తనకు విమాన ప్రయాణం కొత్త అని.. అందుకే పొరపాటు జరిగిందని తెలిపాడు. దాంతో పోలీసులు ఆయనను విడిచిపెట్టారు. విమాన సిబ్బంది కూడా అనుకోని పరిణామానికి తొలుత కొంత భయపడినా.. ఆ తర్వాత విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
ఆ వ్యక్తి గనుక బలవంతంగా ఎగ్జిట్ డోర్ తెరిచి ఉంటే.. అనుకోని ప్రమాదం సంభవించి ఉండేదని సిబ్బంది తెలిపారు. ఈ జరిగిన సంఘటన పై నివేదికను ఇవ్వాల్సిందిగా ఇప్పటికే గో ఎయిర్ యాజమాన్యం తమ సిబ్బందిని ఆదేశించింది. ప్యాసింజర్లకు నిబంధనలను సరైన రీతిలో అర్థం అయ్యేలా విశదీకరించాలని తెలిపింది. గతంలో కూడా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. రాంచీలోని బ్రిసా ముందా విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుందనగా ఓ ప్రయాణికుడు ఎగ్జిట్ డోర్ తీసి అందరినీ బెంబేలెత్తించాడు. విమానాశ్రయంలో దిగి ఎయిర్ఏసియా విమానం రన్‌వేపైకి వస్తుండగా ప్రయాణికుడు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల ఆ ఘటన జరిగింది.