ముంబయిలో భారీ విమాన ప్రమాదం: అయిదుగురి మృతి

ముంబయిలో టెస్టింగ్ నిమిత్తం బయలుదేరిన బెచ్ క్రాఫ్ట్ ఎయిర్ సీ90 ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడంతో అయిదుగురు మృతి చెందారు.

Last Updated : Jun 29, 2018, 05:46 PM IST
ముంబయిలో భారీ విమాన ప్రమాదం: అయిదుగురి మృతి

ముంబయిలో టెస్టింగ్ నిమిత్తం బయలుదేరిన బెచ్ క్రాఫ్ట్ ఎయిర్ సీ90 ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడంతో అయిదుగురు మృతి చెందారు. విమానం ఉన్నట్టుండి నిర్మాణం సగంలో ఉన్న ఓ బిల్డింగ్ మీద పడిపోవడంతో ఇద్దరు పైలట్లతో సహా అయిదుగురు  మరణించారు. ఈ విమానం ముంబయికి చెందిన యూవై ఎవియేషన్ సంస్థకి గతంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విక్రయించడం జరిగింది.

ఈ అమ్మకం జరిగి దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఈ విమానానికి మరమ్మత్తులు జరిపించి.. టెస్టింగ్ నిమిత్తం పంపించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే తొలిసారిగా ఈ విమానం 2008లో క్రాష్‌కి గురైంది. ఆ ప్రమాదం తర్వాత ప్రభుత్వం ఆ విమానాన్ని వేరే కంపెనీకి అమ్మేసింది. ఈ విమానాన్ని కొన్న యూవై ఏవియేషన్ సంస్థ, దాని మెయిన్‌టెనెన్స్ పనులను ఇండామర్ అనే మరో ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. 

తాజా ప్రమాదానికి సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ఇంజనీర్ సురభి బ్రిజేష్ కుమార్ గుప్తా, టెక్నీషియన్ మనీష్ తేజ్ పాల్, గోవింద్ పండిట్ అనే సాధారణ పౌరుడు మరణించారని శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరు పైలట్లలో ఒకరు మహిళా పైలట్ కావడం గమనార్హం.

వాతావరణం బాగా లేకపోయినా కూడా.. విధులకు హాజరై విమానం నడపాల్సిందిగా తన భార్యకు కంపెనీ నుండ ఆర్డర్ వచ్చిందని మరణించిన మహిళా పైలట్ మరియా జుబేరి భర్త సంస్థపై ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ ఇప్పటికే ఎంక్వయరీకి ఆదేశించింది. 

Trending News