JNU Violence updates : JNU ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం

కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ జవహర్‌లాల్ యూనివర్శిటీలో మళ్లీ కలకలం రేగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  ఈ ఘటన జరిగిన తర్వాత మళ్లీ ఆందోళనలు రేకెత్తుతున్నాయి.

Last Updated : Jan 6, 2020, 12:18 PM IST
JNU Violence updates :  JNU ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం

కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ జవహర్‌లాల్ యూనివర్శిటీలో మళ్లీ కలకలం రేగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  ఈ ఘటన జరిగిన తర్వాత మళ్లీ ఆందోళనలు రేకెత్తుతున్నాయి. 
JNU ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమగ్ర విచారణకు ఆదేశించారు. అంతే కాదు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తోనూ ఆయన ఫోన్లో మాట్లాడారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ప్రతినిధులను పిలిపించి చర్చించాలని కోరారు. జేఎన్‌యూలో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఘటనపై ఎలాంటి  చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.  

ఖండించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 
JNU ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. యూనివర్శిటీలు రాజకీయాలకు అడ్డాగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతున్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపారు. ఐతే ఘటనను మాత్రం ఆమె తీవ్రంగా ఖండించారు. 

ఇదంతా స్పాన్సర్డ్ గుండాయిజమ్- కాంగ్రెస్ 
JNU ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. JNU  పరిపాలన దీనికి బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆయన విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకే ఈ ఘటన జరిగిందని .. ఇదంతా స్పాన్సర్డ్ గుండాయిజమ్ అంటూ ధ్వజమెత్తారు.  

నివురుగప్పిన నిప్పులా క్యాంపస్ 
జవహర్‌లాల్ యూనివర్శిటీలో నిన్నటి ఘటనతో అంతా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు క్యాంపస్  చుట్టూ పహారా కాస్తున్నారు. భారీ బలగాలను మోహరించారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చాలా మంది విద్యార్థులు క్యాంపస్ విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. నిన్న సాయంత్రం కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్ లోకి ప్రవేశించారని .. చేతుల్లో కర్రలు, రాడ్లు పట్టుకుని వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని ఓ విద్యార్థిని తెలిపారు. అందుకే తాను క్యాంపస్ విడిచి వెళ్లిపోతున్నట్లు వివరించారు. 

మరోవైపు ఆల్ ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్...AIIMSలో చికిత్స పొందుతున్న 34 మంది JNU విద్యార్థులను వైద్యులు డిశ్చార్జీ చేశారు. వారి పరిస్థితి అంతా సాధారణంగానే ఉందని తెలిపారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News