173 వస్తువులపై జీఎస్‌టీ తగ్గింపు

  

Last Updated : Nov 10, 2017, 03:11 PM IST
173 వస్తువులపై జీఎస్‌టీ తగ్గింపు

23వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం ఈ రోజు ఉదయం అస్సాంలోని గౌహతిలోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 173 వస్తు్వులపై వస్తు సేవల పన్ను తగ్గించడానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. తాజా నిబంధనల ప్రకారం ఇవ్వన్నీ 18 శాతం పన్ను పరిధిలోకి రాబోతున్నాయి.

చూయింగ్ గమ్స్, చాక్లెట్లు , షేవింగ్ కిట్స్, డియోడ్రంట్స్, వాషింగ్ పౌడర్, డిటర్జెంట్, మార్బల్, ఫర్నిచర్, ప్లాస్టిక్ వస్తువులు,షాంపూలు, టూత్ పేస్టులు, షూ పాలిష్ మొదలైన వస్తువులన్నీ ఇక నుండి ఆ శ్లాబులోకే వస్తాయి. అలాగే లగ్జరీ వస్తువులకు వర్తించే 28 % శ్లాబ్‌‌ను 50 వస్తువులకే పరిమితం చేశారు.

పెయింట్ , సిమెంట్ లాంటి వస్తువులు కూడా 28 %  పరిధిలోకే రావడం గమనార్హం. అదేవిధంగా రూమ్ టారిఫ్ 7500 రూపాయలున్న హోటల్స్ 18% పరిధిలోకే వస్తాయని.. అయితే స్టార్ హోటల్ క్యాటగరీకి మాత్రం ఇంకా 28 % శ్లాబ్ వర్తిస్తుందని ఈ సమావేశంలో ప్రభుత్వం తెలిపింది.

అలాగే వస్తు తయారీదారులకు యధావిధిగా 2% వర్తిస్తుంది. చిన్న చిన్న రెస్టారెంట్లకు 5 % పన్ను కూడా యధావిధిగా కొనసాగుతుంది. ట్రేడర్లు 1 శాతం చెల్లిస్తారు.  ఈ జీఎస్‌టీ గ్రూపు ఆఫ్ మినిస్టర్స్ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షత వహించారు.

ఈ ప్యానెల్‌కి అస్సాం ఆర్థిక మంత్రి హిమాంత విశ్వశర్మ ప్యానెల్ హెడ్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం జీఎస్‌టీలో 5,12,18,28 శాతాలకు పన్ను శ్లాబులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 18% శాతం పరిధిలో ఉన్నవాటిని కూడా చాలావరకు 12% శ్లాబ్‌లోకి తీసుకురావాలని డిమాండ్ ఉంది.

ఈ రోజు జీఎస్‌టీ సమావేశం జరుగుతున్న సమయంలోనే పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి, పంజాబ్ ఆర్థిక మంత్రి మనప్రీత్ సింగ్ బాదల్, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి క్రిష్ణబైరే గౌడా, మీటింగ్ జరుగుతున్న హోటల్ ముందు ధర్నాకి దిగారు. జీఎస్‌టీ వచ్చాక తమ రాష్ట్రాలు నష్టాల బారిని పడ్డాయని వాపోయారు. 

Trending News