8వ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ఈ ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ ద్వారా వర్తమాన అంశాలపై నరేంద్ర మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకున్నారు. సుమారు అరగంట పాటు మోదీ ప్రసంగించారు. దేశంలో విపత్తులు సంభవించినప్పుడల్లా భారత వైమానిక దళం ముందు వరుసలో నిలబడి ఆపన్న హస్తం అందిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సర్జికల్ స్ట్రైక్ 2016లో జరిగింది. నేటికి రెండేళ్లు పూర్తయింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రతి భారతీయుడూ గర్వంగా భావిస్తున్నారన్నారు. దేశ సాయుధ దళాలు, సైనికుల ధైర్యసాహసాలకు ప్రతి భారతీయుడూ గర్విస్తున్నారన్న ఆయన.. తమ సైనికులకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. దేశ ప్రగతిని, శాంతి వాతావరణాన్ని నాశనం చేసే వాళ్లెవరికైనా తమ సైన్యం సరైన సమాధానం ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
జవాన్ల సాహసం, త్యాగం యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'ఫోన్‌లో కమాండర్ అభిలాష్ టామీతో నేను మాట్లాడాను. అంతటి పెద్ద విపత్కర చిక్కు నుంచి బయటపడ్డప్పటికీ.. అతని తెగింపు, ధైర్యం ప్రేరణ నిచ్చే అంశం. ఇది దేశ యువతకు నిజంగా ఒక ఉదాహరణ' అని ప్రధాని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే జవాన్లు దీటుగా సమాధానమిస్తారని అన్నారు.
మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ మాట్లాడారు. 'గాంధీజీ తాలిస్మాన్ అని పిలవబడే ఒక స్ఫూర్తిదాయకమైన మంత్రాన్ని బాపూ మనందరికీ ఇచ్చారు. ఈ మంత్రం నేటికీ ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన సమాజంలోని అన్ని వర్గాలలో ప్రజలకు ఆకర్షించారు' అని ప్రధాని మోదీ అన్నారు.
Speaking on a wide range of subjects during #MannKiBaat. Tune in. https://t.co/8iDmYNUUg3
— Narendra Modi (@narendramodi) September 30, 2018
ప్రధాన మంత్రి ప్రసంగం ముగిసి వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదాన్ని ఆకాశవాణి ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి, ఎఫ్ఎం కేంద్రాలు మన్ కీ బాత్ తెలుగు అనువాదాన్ని రిలే చేస్తాయి.