UPS Vs NPS: ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలులోకి రానుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు ప్రత్యామ్నయంగా.. ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. అయితే ఉద్యోగ సంఘాలు యూపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ స్కీమ్‌తో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నాయి.
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన యూపీఎస్‌ను రద్దు చేయాలని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్ఎంఓపీఎస్) డిమాండ్ చేస్తోంది. యూపీఎస్‌కు కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ రిలీజ్ చేయడంపై ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఫైర్ అయ్యారు.
ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ను వసూలు చేసి పెన్షన్ అమలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. యూపీఎస్ అమలు అయితే.. ఎంపీఎస్‌లో జమ అయిన కేంద్ర రాష్ట్ర ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ రూ.10.5 లక్షల కోట్లు కార్పొరేట్ చేతుల్లోకి వెళతాయన్నారు.
కేవలం షేర్ మార్కెట్ ఆధారంగా ఉద్యోగి భవిష్యత్‌ను నిర్ణయించే యూపీఎస్ విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని ఆయన కోరారు.
గతంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను రద్దు చేసి కేంద్రం ఎన్‌పీఎస్‌ను తీసువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్‌పీఎస్ అమలు నుంచి ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
తమకు ఓపీఎస్‌నే అమలు చేయాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌పీఎస్‌ను అమలు చేయకుండా.. ఓపీఎస్‌నే కొనసాగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే స్పందించిన కేంద్రం.. గతేడాది ఓపీఎస్, ఎన్‌పీఎస్ రెండు ప్రయోజనాలతో కలిపి యూపీఎస్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఎస్ అమలులోకి రానుంది. పదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు యూపీఎస్‌లో చేరొచ్చు. యూపీఎస్ వద్దనుకుంటే.. ఎన్‌పీఎస్‌లోనే ఉద్యోగులు కొనసాగొచ్చు.