ఉచిత సేవలకూ జీఎస్టీ బాదుడు.. త్వరలో స్పష్టత!

మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో ఖాతాదారులకు ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన శ్లాబ్‌ను ఆఫర్ చేస్తూ దాని ఆధారంగా ఉచిత సేవలను అందజేస్తున్న విషయం తెలిసిందే.

Last Updated : May 13, 2018, 01:17 PM IST
ఉచిత సేవలకూ జీఎస్టీ బాదుడు.. త్వరలో స్పష్టత!

న్యూఢిల్లీ: ఖాతాదారులకు బ్యాంకులు అందించాల్సిన సేవలకు జీఎస్టీని విధించడంపై రెవిన్యూశాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. అకౌంట్ స్టేట్‌మెంట్, చెక్‌బుక్, ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ వంటి ఉచిత సేవలపై  జీఎస్టీని విధించాలా?వద్దా? అని కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) కోరడంతో ప్రస్తుతం రెవిన్యూ అధికారులు దీన్ని పరిశీలిస్తున్నారు.

డీఎఫ్‌ఎస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ శుక్రవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ, 'బ్యాంకులు తమ ఖాతాదారులకు ఉచితంగా అందజేస్తున్న సేవలపై జీఎస్టీ విధింపు విషయాన్ని రెవెన్యూ విభాగం దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.

బ్యాంకుల యాజమాన్యం తరఫున ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఇప్పటికే ఈ విషయమై పన్నుల విభాగం అధికారులకు విజ్ఞప్తి చేసింది. అయితే ఖాతాదారులకు బ్యాంకులు ఉచితంగా సేవలను అందజేయడం లేదని, నిజానికి అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ నిల్వ ఉంచాలని ఖాతాదారులకు సూచిస్తూ వారి నుంచి చార్జీలు వసూలు చేస్తున్నాయని పన్నుల విభాగం అధికారులు అభిప్రాయపడుతున్నారు. మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో ఖాతాదారులకు ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన శ్లాబ్‌ను ఆఫర్ చేస్తూ దాని ఆధారంగా ఉచిత సేవలను అందజేస్తున్న విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై రెవెన్యూ, ఆర్థిక సేవల విభాగాలు సంయుక్తంగాఒకటి రెండుసార్లు చర్చలు జరిపితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని రాజీవ్ కుమార్ చెప్పారు. డిజిటల్ చెల్లింపులకు జీఎస్టీ ప్రోత్సాహకాలు ఇవ్వడంపై ఏర్పాటైన కమిటీ రానున్న 10 రోజుల్లో మరోసారి సమావేశం కానుంది.

Trending News