ప్రముఖ బాలీవుడ్ సింగర్ పై రాళ్లతో దాడి జరిగిందా..?

ప్రముఖ బాలీవుడ్ సింగర్ షాన్ పై అస్సాం వాసులు మండిపడ్డారు

Last Updated : Oct 30, 2018, 05:24 PM IST
ప్రముఖ బాలీవుడ్ సింగర్ పై రాళ్లతో దాడి జరిగిందా..?

ప్రముఖ బాలీవుడ్ సింగర్ షాన్ పై అస్సాం వాసులు మండిపడ్డారు. గౌహతిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో గీతాలను ఆలపించడానికి వచ్చిన షాన్ పై వారు కాగితపు బంతులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. నిన్న గౌహతిలోని సారుసజాయ్ స్టేడియంలో మ్యూజిక్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్‌లో షాన్ ఓ బెంగాలీ గీతాన్ని ఆలపించారు. అయితే ఆయన బెంగాలీలో పాడడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.   "షాన్ గారూ.. ఇది అస్సాం.. బెంగాల్ కాదు. ఆ విషయం గమనించి పాడండి" అని కొందరు అస్సామీయులు డిమాండ్ చేశారు. కొందరు ఆకతాయిలు ఆయనపై పేపర్ బాల్స్‌తో..  దాడి చేశారు. అయితే కొన్ని వెబ్ సైట్లు అయితే షాన్ పై అభిమానులు రాళ్లతో కూడా దాడి చేశారని ప్రచురించాయి.

అయితే ఆకతాయిలు దాడి చేశాక.. షాన్ తాను ఇక ఆ ప్రోగ్రామ్‌లో పాడనని చెప్పి వెళ్లిపోయారు. "ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దు. కళాకారుల పట్ల ఎప్పుడూ ఇలా ప్రవర్తించవద్దు" అని తెలిపారు. తాను జ్వరంతో బాధపడుతున్నా.. అస్సాంలో తన పాటలంటే ఇష్టపడే వారి కోసం ఇంత దూరం వచ్చానని ఆయన తెలిపారు. అయితే నిర్వాహకులు వెళ్లి బతిమాలడంతో షాన్ ఆ ప్రోగ్రామ్‌లో ఆ తర్వాత కొన్ని పాటలు పాడి.. కార్యక్రమాన్ని వేగంగా ముగించి వెళ్లిపోయారని సమాచారం. 

అయితే ఈ ఘటన జరిగాక ఓ అస్సామీ షాన్‌కి ట్వీట్ చేశారు. కొందరు అస్సామీయులు చేసిన తప్పుకు తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. తప్పు చేసేది ఎవరైనా సరే... తాను సమర్థించనని అన్నారు. ఆ ట్వీట్‌కి షాన్ కూడా సమాధానం ఇచ్చారు. ప్రాంతీయ వివాదాలను రెచ్చగొట్టడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు అని.. యువత ఆ ట్రాప్‌లో పడకూడదని హితవు పలికారు. ప్రఖ్యాత బాలీవుడ్ సింగరైన షాన్ హిందీతో పాటు కన్నడం, తెలుగు, బెంగాలీ, ఆంగ్లం, మలయాళం, ఒరియా, అస్సామీ భాషలలో కూడా పాటలు పాడారు.  తాజా ఘటనతో షాన్ తనపై రాళ్లతో దాడి చేశారన్న వార్తలో నిజం లేదని తెలిపారు. కేవలం కాగితాలతో బంతులు చుట్టి తన విసిరారన్నారు. కానీ కొన్ని వెబ్ సైట్లు కావాలని తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు. 

Trending News