స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాత దిల్ రాజుతో కలిసి చేయనున్న అప్ కమింగ్ సినిమాకు ''ఐకాన్'' అనే ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను ఎంపిక చేశారు. ''కనపడుట లేదు'' అనేది ఈ సినిమా టైటిల్ క్యాప్షన్. ఈరోజు బన్నీ పుట్టినరోజును సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఓ మై ఫ్రెండ్, ఎంసిఏ వంటి చిత్రాల ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. బన్నీ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఇదిలావుంటే ప్రస్తుతం అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డె జంటగా నటిస్తోంది. దువ్వాడ జగన్నాథం తర్వాత ఈ జోడీ మరోసారి ఈ సినిమా కోసం జతకట్టింది.
ఇదే కాకుండా సంచలన చిత్రాల దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లోనూ స్టైలిష్ స్టార్ ఓ సినిమాలో నటించనున్నాడు. గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'ఆర్య', 'ఆర్య 2' సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.