Manjunatha Reddy Death: ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) మరణం సంచలనం రేకెత్తిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్మెంట్లో మంజునాథరెడ్డి విగజీవిగా కనిపించారు. మూడు రోజుల క్రితం ఈ అపార్ట్మెంట్కి వచ్చిన మంజునాథరెడ్డి.. తన ఫ్లాట్‌లో శవమై కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
వృత్తి రీత్యా మంజునాథరెడ్డి కాంట్రాక్టర్. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆయన కాంట్రాక్ట్ పనులు చేపడుతున్నారు. అప్పుడప్పుడు కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌కు వచ్చి వెళ్తుంటారు. నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి ఈ అపార్ట్మెంట్ బాధ్యతలు చూస్తున్నాడు. శుక్రవారం (ఆగస్టు 19) రాత్రి మంజునాథరెడ్డి చనిపోయిన విషయాన్ని నరేంద్ర రెడ్డే మొదట గుర్తించాడు. ఫ్లాట్ తలుపు లోపలి వైపు నుంచి లాక్ చేసి ఉండటంతో కిటికీ ఎక్కి తలుపు తెరిచినట్లు అతను తమతో చెప్పాడని అపార్ట్మెంట్ వాసులు వెల్లడించారు.
ఫ్లాట్ లోపల బెడ్ పక్కనే మంజునాథ రెడ్డి ఫ్లోర్‌పై పడిపోయి ఉన్నాడని.. నరేంద్ర రెడ్డి తమను పిలవడంతో వెళ్లి చూశామని వారు వెల్లడించారు. మంజునాథరెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించారని.. అయితే ఆయన ఆసుపత్రిలో చనిపోయారా ఇక్కడే చనిపోయారా అనేది తెలియదన్నారు. ప్రస్తుతం మంజునాథరెడ్డి మృతదేహం మణిపాల్ ఆసుపత్రిలో ఉంది.
మంజునాథరెడ్డి తండ్రి, పీఎంఆర్ కన్స్ట్రక్షన్స్ యజమాని, వైసీపీ నేత మహేశ్వర్ రెడ్డి కుమారుడి మరణవార్త తెలిసి తాడేపల్లి బయలుదేరారు. పలు రాష్ట్రాల్లో మంజునాథ్ రెడ్డి చేపట్టిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని.. సకాలంలో బ్యాంక్ ఫైనాన్స్ కూడా రాకపోవడంతో తన కుమారుడు ఒత్తిడిలో ఉన్నాడని మహేశ్వర్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో మంజునాథ్ రెడ్డి అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడే అవకాశం ఉంది.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మళ్లీ తగ్గింది...
Also Read:Horoscope Today August 20th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశి వారిని నెగటివిటీ వెంటాడుతుంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook