ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదేళ్ల చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు జడ్జి అంతిమ తీర్పు వెల్లడించారు. గత ఎనిమిదేళ్ల కాలంలో ఈ కేసుకు సంబంధించి 79 మందిని విచారించిన న్యాయస్థానం.. పంది వెంకట్ రావు గౌడ్‌ను ప్రధాన దోషిగా నిర్ధారించింది. అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాతైన నిందితులకు శిక్ష పడటంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
అయిన వారి చేతిలోనే హత్యకు గురైన నాగ వైష్ణవి..
విజయవాడలో స్థానికంగా బీసీ నాయకుడిగా ఎదుగుతున్న పలగాని ప్రభాకర్ కూతురే ఈ నాగవైష్ణవి. 2010, జనవరి 30న నాగవైష్ణవి కారులో పాఠశాలకు వెళ్తుండగా దారిలోనే కారును అడ్డగించిన దుండగులు డ్రైవరును హతమార్చి ఆ చిన్నారిని కిడ్నాప్ చేశారు. నాగవైష్ణవి కిడ్నాప్ అనంతరం పాప ఆచూకీ కోసం రెండు రోజులపాటు తీవ్రంగా గాలించిన కుటుంబసభ్యులకు చివరకు నిరాశే ఎదురైంది. గుంటూరు శివార్లలోని ఆటోనగర్‌లో ఉన్న ప్లాట్ నెంబరు 445లో నాగ వైష్ణవి శవమై కనిపించింది. పదేళ్ల పసిబాలికను చిత్ర హింసలకు గురిచేసిన కిడ్నాపర్లు.. అనంతరం ఆ చిన్నారిని బాయిలర్‌లో వేసి దారుణంగా హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.
కుటుంబ తగాదాలు, ఆస్తి గొడవలే ఈ కిడ్నాప్, హత్యకు కారణం అని తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలోనే విచారణ చేపట్టారు. పలగాని ప్రభాకర్‌పై ఉన్న కోపంతో ఆయన మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు గౌడ్ ఈ హత్యకు కుట్ర పన్నిన ప్రధాన సూత్రధారుడిగా గుర్తించిన పోలీసులు... ఈ కిడ్నాప్, హత్య కుట్రలో అతడితోపాటు అతడికి సహకరించిన మొర్ల శ్రీనివాస రావు, యెంపర్ల జగదీష్‌లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నాగ వైష్ణవి హత్య అనంతరం ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో కేసుని తీవ్రంగా పరిగణించిన కోర్టు ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయలేదు. అలా అప్పటి నుంచి రిమాండ్ ఖైదీలుగా జైల్లోనే ఉన్న ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చుతూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు గురువారం వారికి జీవిత ఖైదు విధిస్తూ తుది తీర్పు వెల్లడించింది.