ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న పోరాటానికి తెలుగు సినీ ప్రముఖులపై మద్ధతు కొరవడింది అని ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయంగా ఇటు ఇండస్ట్రీ పరంగా ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఈ విషయంలో రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ.. అంతకన్నా ముందుగా రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఓ న్యూస్ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో పరిశ్రమ గురించి పోసాని కృష్ణమురళితో మాట్లాడుతూ ఆ టీవీ ఛానెల్ యాంకర్ చేసిన పలు అనుచిత వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత వేడెక్కించాయి. ఆ న్యూస్ ఛానెల్ యాంకర్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు సినీ పరిశ్రమను కించపర్చేలా వున్నాయంటూ తెలుగు సినీ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తంచేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా వెనువెంటనే జరిగిపోయాయి. దీంతో జరిగిన పొరపాటుపై నాలుక కర్చుకున్న సదరు టీవీ ఛానెల్ యాజమాన్యం పరిశ్రమకు క్షమాపణలు చెప్పుకుంది.
అయితే, ఈ వివాదంలో టీవీ ఛానెల్ వైఖరి గురించి తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ " మీడియా లేకపోతే సినీ పరిశ్రమ లేదు. సినీ పరిశ్రమ లేకపోతే మీడియా లేదు" అని అన్నారు. మీకు ఇంటర్వ్చూలు ఇవ్వడానికి, మీ టీవీ షోలకు సినిమా వాళ్లు కావాలి. అలా మా సహాయం తీసుకుంటూనే మళ్లీ మమ్మల్నే తిడతారా? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి అన్యాయంగా తమని దూషించి.. అర్ధరాత్రి 11 గంటలకు క్షమాపణలు చెబుతూ చిన్న స్ర్కోలింగ్ ప్లే చేయడం సమంజసం కాదు అంటూ ఆ ఛానెల్ తీరు పట్ల శివాజీ రాజా ఒకింత ఆవేదన వ్యక్తంచేశారు.
అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపైనా శివాజీరాజా మరోసారి మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడటానికి సినిమా వాళ్లు ముందుకు రానిపక్షంలో తాము సినిమాలు చూడబోమంటూ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారని, కానీ అసలు ఆయనది ఎప్పుడైనా టికెట్ కొని సినిమా చూసిన మొహమేనా? అని శివాజీరాజా ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై నాయకులకే ఓ స్పష్టత లేనప్పుడు ఇక తమకేం స్పష్టత ఉంటుంది అంటూ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై శివాజీరాజా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.