Pawan Kalyan On Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. ప్రాథమిక ఆధారాలు కూడా చూపించకుండా అర్ధరాత్రులు అరెస్టు చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంభిస్తున్నారని మండిపడ్డారు. గతేడాది అక్టోబరులో విశాఖపట్నంలో తమ పార్టీ పట్ల పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో ప్రజలందరూ చూశారని.. హత్యాయత్నం కేసులు పెట్టి జనసేన నాయకులను జైళ్లలో పెట్టారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల నంద్యాలలో వ్యవహరించిన విధానం కూడా అలాంటిదేనని అన్నారు. ఆయన అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నామన్నారు.
అప్రజాస్వామిక పాలనకు అద్దం పడుతోందని.. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని జనసేన భావిస్తోందన్నారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్షాలను అణచివేయాలనే వైసీపీ విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. పాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరు.. చిత్తూరులో ఘటనలు చూస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నారు.
"వైసీపీ పార్టీ నాయకులు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే తమ పార్టీ, పోలీసులు, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. మాకు అర్ధంకాని విషయం ఏమిటంటే.. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయాల్సింది పోలీసు వ్యవస్థ కదా..? దాంతో వైసీపీ వాళ్ళకు సంబంధం ఏంటి..? అసలు వైసీపీ పార్టీ వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. మళ్లీ వాళ్లే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని మాట్లాడుతున్నారు. ఒక పార్టీ అధినేత అరెస్టు అయితే వాళ్ల నాయకులు, అనుచరవర్గం బయటకు వస్తారు. అది ప్రజాస్వామ్యంలో భాగం. ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ నిరసన చెబుతారు. వాళ్ళ నాయకుడికి మద్దతు తెలపొద్దు అంటే ఎట్లా..?" అని ప్రశ్నించారు.
వైసీపీ నాయకులు మాత్రం అక్రమాలు, దోపీడీలు చేసి జైళ్లకు వెళ్తారని.. ఆ తరువాత విదేశాలకు వెళ్లొచ్చని.. ఏ తప్పు చేయకపోయినా ఇతర పార్టీ నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు అని ఆంక్షలు పెట్టడం ఏమిటి..? అని నిలదీశారు పవన్ కళ్యాణ్. ఇది శాంతిభద్రతల సమస్య కంటే కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ దీని నుంచి బయటపడాలని కోరుకుంటూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook