Happy Pongal 2023: సంక్రాంతి కోడి పందేలంటే ఆషామాషీ కాదు, నక్షత్రం, రాశిని బట్టి పోటీ, అంతా కుక్కుట శాస్త్రం ప్రకారమే

Cock Fights: సంక్రాంతి అంటే చాలు ముందుగా గుర్తొచ్చి హుషారు తెప్పించేది కోడి పందేలు. గోదావరి జిల్లాల్లో కోడి పందేలు లేకుండా సంక్రాంతి జరగనే జరగదు. అలాగని కోడి పందేల్ని సింపుల్‌గా తీసుకోవద్దు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కానేకాదు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 12, 2023, 08:40 AM IST
Happy Pongal 2023: సంక్రాంతి కోడి పందేలంటే ఆషామాషీ కాదు, నక్షత్రం, రాశిని బట్టి పోటీ, అంతా కుక్కుట శాస్త్రం ప్రకారమే

ఏదో రెండు బలమైన కోళ్లను పోటీకు దింపి అదే కోడి పందేలంటారని అనుకుంటే చాలా పొరపాటు. ఇదేమీ సాధారణ వ్యవహారం కాదు. దీనికో శాస్త్రముంది. జ్యోతిష్యముంటుంది. రాశి, నక్షత్రాలుంటాయి. అంతా శాస్త్ర ప్రకారమే.

సంక్రాంతి కోడిపందేలకు ప్రసిద్ధి గోదావరి జిల్లాలు. సంక్రాంతి మూడ్రోజులతో పాటు అటూ ఇటూ మొత్తంగా వారం రోజులు అత్యంత ఘనంగా  జరుగుతాయి కోడిపందేలు. సంక్రాంతి సమయంలో కేవలం గోదావరి జిల్లాల్లో కోడిపందేలపై 4 వందల కోట్ల వరకూ బెట్టింగ్ జరుగుతుందంటే నమ్మలేకున్నారా..కానీ నిజమిది. లోపలి, బయటి పందేలు కలిపి 4 వందల కోట్లుంటుంది. సంక్రాంతి కోసం కాకున్నా కోడి పందేల కోసమైనా విదేశాల్ని, సుదూరం నుంచి తరలి వస్తుంటారు. కోడిపందేలు లేకుండా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి లేదంటే అతిశయోక్తి లేదు. 

ఇక్కడ కోడిపందేలు రాత్రిళ్లు ఫ్లడ్‌లైట్ వెలుగుల్లో ఏదో డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ జరిగినట్టు స్డేడియంలో కూడా జరుగుతుంటాయి. భారీగా ఫ్లడ్‌లైట్ కాంతుల్లో వెలిసే పందెం బరులు, ఆ చుట్టూ వివిధ రకాల ఫుడ్ ‌స్టాల్స్..ఇవి చాలదన్నట్టుగా గుండాట వంటి ఇతర జూదాలు. ఒక్కమాటలో చెప్పాలంటే కాక్ కార్నివాల్ అనొచ్చు.

కోడిపందేలకు ప్రత్యేకంగా ఓ శాస్త్రం

కోడి పందేలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దీనివెనుక కఠోర పరిశ్రమ ఉంటుంది. కోడి పందేలకు ప్రత్యేకంగా ఓ శాస్త్రముంది. దాని పేరు కుక్కుట శాస్త్రం. ఇందులో కోడి పందేలకు కోళ్లను ఎలా సిద్ధం చేయాలి, ఏ జాతి కోడిని ఏ జాతి కోడితో పందేనికి దింపాలి, రాశి, తిధి, నక్షత్రాన్ని బట్టి ఏ జాతి కోడిని ఎలా, ఎప్పుడు బరిలో దింపాలనే వివరాలు పూర్తిగా ఉంటాయి. కోడి రంగును బట్టి కూడా బరిలో దింపుతుంటారు. 

మనుషులకున్నట్టే కోళ్లకు 27 నక్షత్రాలుంటాయి. ఇవి అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వాస, పుష్య, అశ్లేష్, మాఘ, పూర్వ ఫాల్గుణి, పుబ్బ, ఉత్తర ఫాల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట, శతభిష, పూర్వాభాద్ర, ఉత్రరాభాద్ర, రేవతి ఉన్నాయి. నక్షత్రాలు, రాశిని బట్టే కోళ్లను బరిలో దింపుతారు. 

పందెం కోళ్ల పెంపకం ఎలా

పందెం కోళ్లు పెంపకం వెనుక ఏకంగా 8-10 నెలల కృషి ఉంటుంది. ఈ కోళ్లకు ఆహారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. జీడిపప్పు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్, బోన్‌లెస్ చికెన్ ఆహారంగా ఉంటుంది. ఇది కాకుండా ఇతర పౌష్టిక ఆహారంతో పాటు గోరు వెచ్చని నీటితో స్నానం చేయిస్తుంటారు. ఈత కొట్టిస్తారు. రోజూ ఇతర కోళ్లతో తర్ఫీదు ఉంటుంది. రెచ్చగొడితే ఎలా రెచ్చిపోవాలో నేర్పిస్తారు. ప్రత్యేకంగా కూరేటర్లు ఉంటారు. 

పందెం కోళ్ల రకాలు

పందెం కోళ్లలో దాదాపు 16 వరకూ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కాకి, నల్ల కాకి, సేతు, పర్ల, సవల, కొక్కిరాయి, డేగ, నెమలి, కౌజు, మైల, పూల పింగళ, నల్లబోర, ఎర్రపొడ, ముంగిస, అబ్రాసు, గేరువా వంటి రకాలు ప్రముఖమైనవి. 

పందెం కోళ్ల ధర

కోడి పందేల ద్వారా సంక్రాంతి సమయంలో 4 వందల కోట్ల వరకూ టర్నోవర్ బెట్టింగు ఎలా జరుగుతుందో..ఈ పందెం కోళ్ల ధర కూడా అంతే ఎక్కువ. పందెం కోళ్ల ధరలు వింటే నోరెళ్లబెట్టాల్సిందే. కోడి బలం, జాతి, నక్షత్రం బట్టి ధర ఉంటుంది. ఒక్కొక్క కోడి కనీస ధర 5-10 వేల నుంచి ప్రారంభమై..1 లక్ష రూపాయల వరకూ ఉంటుంది. ఇది కాకుండా పందెంలో ఓడిన లేదా మరణించిన కోళ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. దీనినే కోసు అంటారు. సాధారణంగా గెల్చినవాళ్లు తీసేసుకుంటారు. కొన్నిచోట్ల వీటిని వేలం వేసి మరీ అమ్ముతుంటారు. ఈ మాంసం చాలా రుచిగా కూడా ఉంటుంది. 

Also read: Adnan sami Controversy: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై వేర్పాటువాద ముద్ర, దుమారం రేపుతున్న అద్నాన్ సమీ వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News