RK ROJA: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. త్వరలోనే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మాజీమంత్రులు సైలెంట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.. స్వయంగా పార్టీ అధినేతే నియోజకవర్గ వర్గాల టూర్‌కు వస్తుంటే.. వాళ్లు మాత్రం సొంతూళ్లకు వెళ్లేందుకు ససేమీరా అంటున్నారట.. దాంతో జగన్ టూర్ ఎలా సాగుతుందోనని పార్టీ హైకమాండ్ ఆందోళనలో ఉందని తెలుస్తోంది. గతంలో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా గుర్తింపు పొందిన లీడర్లు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారని పార్టీ హైకమాండ్ ఆరా తీస్తున్నట్టు సమాచారం..
2019 ఏడాదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో సీనియర్ నేతలుగా ఉన్న ఆర్కే రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్‌కు మంత్రి పదవులు దక్కాయి. అయితే మంత్రి పదవులు రావడంతో ఈ నలుగురు లీడర్లు తమకు అడ్డు అదుపు లేదన్నట్టుగా చెలరేగిపోయారు. రోజా అయితే ప్రతిపక్ష నేత అయినా చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఇష్టరీతిన దుర్భాషలాడారు. ఒకనొక దశలో వ్యక్తిగత దుషణలతో విరుచుకుపడ్డారు. అప్పట్లో రోజా నోటికి తాళం వేయాలంటూ సొంత పార్టీ లీడర్లే చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే అధికారం కోల్పోగానే మాత్రం రోజా నోటికి తాళం పడింది.. ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే తప్పితే మీడియా ముందుకు రావడం లేదు. అంతేకాదు నగరి నియోజకవర్గానికి ఆమె ముఖం చాటేశారట.. పార్టీ కార్యక్రమాలకు సైతం అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.. ఇప్పుడు జగన్ జిల్లాల పర్యటనకు వస్తుండటంతో రోజా ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటారా. లేక చెన్నైకే పరిమితం అవుతారా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది..
ఇక మాజీమంత్రి కొడాలినానిది కూడా ఇదే సీన్.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నోటికి అడ్డు అదుపులేకుండా రెచ్చిపోయారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌ను నోటికొచ్చినట్టు తిట్టారు. ప్రతిపక్ష నేతలను నోటితో చెప్పలేని రీతిలో దుర్భాషలాడారు. అయితే గుడివాడలో ఓటమి తర్వాత.. కనిపించకుండా పోయారు. ప్రస్తుతం నియోజకవర్గానికి కూడా ముఖం చాటేశారని టాక్ వినిపిస్తోంది.. దాదాపు 8 నెలల తర్వాత.. ఒకే సారి మీడియా ముందుకు వచ్చిన కొడాలినాని.. చంద్రబాబు గారు అంటూ సంబాషించడం మీడియా ప్రతినిధులను సైతం ఆశ్చర్యానికి గురి చేసిందని చెబుతున్నారు. అయితే కొడాలి నాని కేసులకు భయపడే తిట్టలేకపోతున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోందట. అయితే కొడాలి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ను చూసి చెలరేగిపోయిన నేతలు, కార్యకర్తలు మాత్రం ఇప్పుడు ముఖం చాటేయడంతో.. తెగ పరేషాన్ అవుతున్నారని తెలుస్తోంది..
మరోవైపు మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లో విచిత్ర పరిస్థితి.. కూటమి సర్కార్ దెబ్బకు ఆయన చెన్నైకు మకాం మార్చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో కీలక లీడర్‌గా వ్యవహరించిన అనిల్ కుమార్ ఇప్పుడు కనీసం నరసరావు పేట వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. అటు నెల్లూరు అయినా వెళ్తాడా అది కూడా లేదట. అయితే నరసరావుపేటలో రాజకీయం చేయలేక.. నెల్లూరుకు రాలేక ఆయన సతమతం అవుతున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి రెండుసార్లు గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఏకంగా మంత్రి పదవిలో కూర్చున్నారు. అయితే మంత్రి కాగానే ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. ఇటీవల ప్యాన్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే కూటమి సర్కార్ కేసులకు భయపడే అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్‌గా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది.
వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. పేర్ని నాని మరో కథ.. పేర్నినాని పార్టీ హైకమాండ్‌కు అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వం తీరుపై అప్పుడప్పుడు ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ తాజాగా మచిలీపట్నంలో బియ్యం గోదామ్ల నిర్వహణలో అవకతవకలు జరగాయని ప్రభుత్వం తేల్చడంతో.. మాజీమంత్రి భార్య జయసుధపై కేసు నమోదైంది. దాంతో మొత్తం ఫ్యామిలీనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే రెండుమూడు రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తాము ఎలాంటి తప్పుచేయలేదని చెప్పుకొచ్చారు. కానీ కూటమి సర్కార్ మాత్రం ఆయన్ను కాకుండా ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా కూటమి సర్కార్ దెబ్బకు.. వైసీపీలో కీలక లీడర్లంతా గప్‌చుప్ కావడం ఇప్పుడు సొంత పార్టీ లీడర్లనే పరేషన్ చేస్తుందని, రానున్న రోజుల్లో పరిస్థితులు ఇంకెలా ఉండబోతాయోనని ఆందోళన చెందుతున్నారని సమాచారం..
Also Read: Rain Alert: బలపడిన అల్పపీడనం వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు
Also Read: YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో 2027లో ఎన్నికలు మనమే గెలిచేది: మాజీ సీఎం వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook