విజయవాడ: కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు విజయవాడ గుణదలలోని సెల్ టవర్ ఎక్కారు. తాము 28 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం తమను పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయిదుగురు విద్యార్థులు, ఒక విద్యార్ధి తండ్రి సెల్ టవర్ ఎక్కిన వారిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే తాము సెల్ టవర్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఏపీ వైద్య మంత్రి కామినేని స్పష్టమైన హామీ ఇచ్చేవరకు సెల్ టవర్ దిగే ప్రసక్తే లేదని విద్యార్థులు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్టులో కడప ఫాతిమా మెడికల్ కాలేజీ సీట్ల రీఅలకేషన్ పై విద్యార్థులు వేసిన పిటీషన్ ను కోర్ట్ కొట్టివేసిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజయవాడలో దాదాపు నెలరోజుల నుండి ఆ కాలేజీ విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన, నిరసనలు చేస్తున్న సంగతి అందికీ తెలిసిందే.. !!
కాగా విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 9 గంటలకు తన వద్దకు రావాలని కోరారు. ఈ నవంబర్ 28వ తేదీన ఫాతిమా కాలేజీ విదార్థులతో కలసి మంత్రి కామినేని ఢిల్లీకి వెళ్లనున్నారు.