డీఎస్సీలో మళ్లీ గందరగోళం.. రోస్టర్ చూసి అభ్యర్థుల ఆవేదన

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ 2018 షెడ్యూల్ లక్షలాది మంది అభ్యర్థులను ఆవేదనకు గురి చేస్తోంది.

Last Updated : Nov 4, 2018, 04:05 PM IST
డీఎస్సీలో మళ్లీ గందరగోళం.. రోస్టర్ చూసి అభ్యర్థుల ఆవేదన

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ 2018 షెడ్యూల్ లక్షలాది మంది అభ్యర్థులను ఆవేదనకు గురి చేస్తోంది. నాలుగేళ్లుగా తమ కష్టాలు తీరుతాయని ఎదురుచూసిన నిరుద్యోగులు రోస్టర్ చూసి  కంగుతిన్నారు. జిల్లాల వారీగా అతి తక్కువ సంఖ్యలో ఉన్న కేటాయింపులు చూసి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని వాపోతున్నారు. దాదాపు 23 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన విద్యాశాఖ కేవలం 7729 పోస్టులు  మాత్రమే విడుదల చేయడంతో అభ్యర్థులు నిరాశ, నిస్పృహలతో సతమతమవుతున్నారు.

ఈ నెల 26వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలల్లో 4,341 పోస్టులతో పాటు , మున్సిపల్‌ స్కూళ్లలో 1,100 పోస్టులు, గిరిజన గురుకులాల్లో 500 పోస్టులు, ఆశ్రమ స్కూళ్లలో 300 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 909 పోస్టులు, రెసిడెన్షియల్‌ పాఠశాలలలో 175 పోస్టులు, బీసీ గురుకులాల్లో 404 పోస్టులు ఉన్నట్లు తెలిపింది. అయితే కొన్ని చోట్ల పోస్టుల సంఖ్య మరీ తక్కువగా ఉండడంతో విద్యార్థులు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. స్వయానా సీఎం చంద్రబాబు నాయుడి జిల్లా అయిన చిత్తూరులో ఎస్జీటీలకు కేవలం రెండు పోస్టులే కేటాయించడంతో అందరూ అవాక్కయ్యారు. అలాగే విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచిన విశాఖ జిల్లాలో కేవలం భాషా పండితులకు 3 పోస్టులే కేటాయించడంతో అభ్యర్థులు ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. 1100 నెంబరుకి సమాచారం అందించి మరీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

గతంలో 22 వేల పోస్టులను విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట మార్చడంపై అభ్యర్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో శ్రమకోర్చి కోచింగ్ తీసుకొని మరీ పరీక్షలకు సిద్ధమైతే.. ఇప్పుడు ప్రభుత్వం తమను నట్టేటా ముంచిందని పలువురు వాపోతున్నారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు ప్రభుత్వం ముందుకు పలు డిమాండ్లను తీసుకొస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం పోస్టులను పెండింగ్‌లో పెట్టకుండా.. ఖాళీగా ఉన్న 23 వేల పోస్టులనూ వెంటనే భర్తీ చేయాలని తెలిపాయి.

అలాగే డీఎస్సీని ఆన్ లైన్‌లో మళ్లీ నిర్వహించద్దని... ఆఫ్ లైనులోనే నిర్వహించాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎడ్ సెట్ 2018లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు డిగ్రీలో 40 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించిన ప్రభుత్వం.. బీఈడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు అర్హతగా కేటాయించడం పై కూడా కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక బీటెక్ పూర్తి చేసి.. ఆ తర్వాత బీఈడీ చేసిన విద్యార్థులు కూడా గందరగోళానికి గురి అవుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తును ఆన్ లైనులో స్వీకరించిన సైటులో బీఏ, బీఎస్సీ ఆప్షన్లు తప్ప బీటెక్ ఆప్షన్ కనిపించకపోవడంతో.. ఎలా ఫారమ్ నింపాలో తెలియక తల పట్టుకుంటున్నారు. 

అలాగే 2019 మార్చి వరకు ఏర్పడే ఖాళీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ నిర్వహించవద్దని.. 2019 ఏప్రిల్‌ వరకు ఖాళీ అయ్యే పోస్టులను కూడా ఈ డీఎస్సీకి జత చేస్తే కొంతవరకైనా అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం  ఉందని పలువురు తెలియజేయడం గమనార్హం. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎస్జీటీ పోస్టులు వందల సంఖ్యలో ఉన్నా.. నెల్లూరు, చిత్తూరు మొదలైన జిల్లాలలో అవే పోస్టులు మరీ 40 లోపే ఉండడంతో కూడా ఆ ప్రాంత అభ్యర్థులు తీవ్ర  ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు డీఎస్సీని రద్దు చేసి.. మళ్లీ మొత్తం పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమను నట్టేటా ముంచిందని వాపోతున్నారు. కాగా.. డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడినతర్వాత.. తొలిరోజే దాదాపు 5,658 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ సంవత్సరం అత్యధికంగా 7,657 పోస్టులలో 3,660 పోస్టులు ఎస్జీటీలకే ఉండడంతో మిగతా అభ్యర్థులు బాధపడుతున్నారు.

Trending News