అమరావతి: నేడు జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నవయుగ సంస్థకు ఇచ్చిన పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. రూ.3216.11 కోట్ల టెండర్ల రద్దుకు ఓకే చెప్పింది.
ఈ సమావేశంలో ఏపీ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇలా వున్నాయి.
రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్ ఆమోదం.
ఇప్పటికే కాంట్రాక్టర్‌కు చెల్లించిన అడ్వాన్స్‌ల రికవరీకి కేబినెట్ ఆమోదం.
మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలనే నిర్ణయానికి ఆమోదం.
మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగింపు.
ఇదిలావుంటే, నేటి కేబినెట్ భేటీలో ఆశా వర్కర్లకు వేతనాల పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. అవును, ఆశావర్కర్లకు గుడ్ న్యూస్ వినిపిస్తూ వారి వేతనాల పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై ఆశా వర్కర్ల వేతనాలు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెరగనున్నాయి. ఏపీ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆశా వర్కర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది.