అమరావతి: గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అసెంబ్లీలో మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా, నేడు విజయవాడ నుండి విశాఖపట్నం చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమానాశ్రయం నుండి బయటకు రాగానే నిరసనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైస్సార్సీపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకుని 'బాబు గో బ్యాక్'.. ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. రెండు వర్గాలు ఒకేసారి రావడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందని, దీంతో సాధారణ పరిస్థితిని నెలకొల్పడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని పోలీసులు అధికారులు తెలిపారు.
చంద్రబాబు తన వాహనం నుంచి దిగి రోడ్డు మీద భైఠాయించడంతో పోలీసు అధికారులు నిరసనను విరమించమని కోరినప్పటికీ, వారి సూచనను తిరస్కరించిన ఆయన శాంతియుత నిరసనను కొనసాగిస్తానని తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చంద్రబాబుని అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారో పోలీసు అధికారులు తమకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని టీడీపీ అధినేత కోరారు. వెంటనే పోలీసులు స్పందిస్తూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 151 కింద అరెస్టు చేస్తున్నట్లు అధికారులు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
గత నెలలో ప్రభుత్వం విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి వచ్చిన చంద్రబాబును స్వాగతించడానికి పెద్ద సంఖ్యలో విశాఖకు చెందిన టీడీపీ మద్దతుదారులు విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు వైస్సార్సీపీ డిమాండ్ చేస్తూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా వ్యతిరేకించిన చంద్రబాబు విశాఖలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని అన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నంను, జ్యుడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలును, అమరావతిని లెజిస్లేటివ్ కాపిటల్ గా ఏర్పాటు చేయబడుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..