హైదరాబాద్: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారనే దుర్వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ రావు మరణంపై రకరకాల వార్తలు వస్తున్నాయని, క్షణానికొక తీరుగా ప్రచారం జరుగుతోందన్న బొత్స సత్యనారాయణ.. ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా తెలంగాణ సర్కార్‌కి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా కోడెల మృతిపై మంత్రి బొత్స సత్యనారాయణ పలు సందేహాలు వ్యక్తంచేశారు. కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిని అనంతరం ఆయన్ను కేర్, అపోలో లాంటి ఆస్పత్రులకు తీసుకెళ్లకుండా క్యాన్సర్ వ్యాధిని నయం చేసే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లడం ఏంటని మంత్రి బొత్స సందేహాలు వ్యక్తంచేశారు. అందువల్లే డా కోడెల శివప్రసాద్ రావు మృతిపై విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ సర్కార్‌ని కోరుతున్నట్టు మంత్రి బొత్స అభిప్రాయపడ్డారు. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపి ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి.