ఆంధ్రపదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. 2018 ఏడాదికి గానూ ‘ఉత్తమ జాతీయ టూరిజం అవార్డు’ అందుకుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరఫున ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ .. కేంద్ర పర్యాటక సహాయ మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. పర్యాటక అనుకూల విధానాలతో నిత్యనూతనంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించటంలో ముందున్న రాష్ట్ర పర్యాటక శాఖకు ఈ మేరకు గౌరవం లభించింది.
పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం ప్రతి ఏటా ఈ అవార్డు ప్రదానం చేస్తుంది. టూరిజం అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వ విశేష కృషి చేయడంతో 'బెస్ట్ టూరిజం 2018' అవార్డు ఆంధ్రప్రదేశ్ కు వరించింది . గతేడాది కూడా జాతీయ పర్యాటక అవార్డును ఏపీనే దక్కించుకోవడం విశేషం. రాష్ట్ర విభజన జరిగి కీలక పర్యాటక ప్రాంతాలు కోల్పోనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక విభాగంలో టాప్ పొజిటన్లో నిలవడం గమనార్హం.