శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత

శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేశారు.

Last Updated : Mar 19, 2018, 09:35 AM IST
శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత

శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేశారు. దేశంలో మత ఘర్షణలు చెలరేగడంతో గత 12 రోజులుగా శ్రీలంకలో మైత్రి ప్రభుత్వం అత్యవసర పరిస్థితి  విధించిన సంగతి తెలిసిందే. దేశంలో బౌద్ధులు, ముస్లింల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో ముగ్గురు మృతిచెందడంతో పాటు వందల కొద్ది దుకాణాలు నాశనమయ్యాయి. హింసాకాండ దేశవ్యాప్తంగా విస్తరించకుండా అరికట్టేందుకు ఈ నెల 6న దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో అమలులో ఉన్న ఎమర్జెన్సీని ఎత్తివేసినట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు.

ఎమర్జెన్సీ విధించిన సమయంలో భద్రతా దళాలు, పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకోవడానికి అన్ని అధికారాలు కల్పించారు. అల్లర్లతో సంబంధమున్నట్లు గుర్తించిన దాదాపు 300 మందిని అరెస్ట్ చేసి.. వారికి ఈ నెలాఖరు వరకు కస్టడీ విధించింది. కాండీ జిల్లా పరిసర ప్రాంతాల్లో గొడవలు విస్తరించకుండా అరికట్టడంలో పోలీసులు విఫలమవడంతో ఎమర్జెన్సీని విధించి సైన్యాన్ని రంగంలోకి దించారు. తమిళ వేర్పాటువాద యుద్దం కారణంగా 2009లో అత్యవసర పరిస్థితి విధించారు. ఆ తరువాత అత్యవసర పరిస్థితిని విధించడం ఇదే తొలిసారి.

Trending News