Indian Students In Ukraine: ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులకు " గో బ్యాక్ " నిరసన సెగలు.. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు

Indian Students In Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు వ్యతిరేకంగా అక్కడి స్థానికుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధమే భారతీయులపై ఉక్రెయిన్ పౌరుల ఆగ్రహానికి కారణమైంది.

Written by - Pavan | Last Updated : Aug 20, 2023, 07:18 PM IST
Indian Students In Ukraine: ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులకు " గో బ్యాక్ " నిరసన సెగలు.. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు

Indian Students In Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు వ్యతిరేకంగా అక్కడి స్థానికుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధమే భారతీయులపై ఉక్రెయిన్ పౌరుల ఆగ్రహానికి కారణమైంది. రష్యాకు భారత్ మిత్రదేశంగా కొనసాగుతుండటం, రష్యా - భారత్ మధ్య సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో తమ శత్రువు అయిన రష్యాకు మిత్రుడిగా ఉన్నందుకు భారత్‌ని కూడా ఉక్రెయిన్ పౌరులు అదే దృష్టితో చూస్తున్నారు. 

రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఆపడంలో భారత్ కీలక పాత్ర పోషించాలి అని ఉక్రెయిన్ కోరుకుంటోంది. కానీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. దీంతో ఉక్రెయి వాసులకు క్రమక్రమంగా భారత్ పై ఆగ్రహం పెరుగుతూ వస్తోంది. ఈ కారణంగానే ఉక్రెయిన్‌లో ఉన్నత చదువులు చదువుకుంటున్న భారతీయులు కూడా నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఉక్రెయిన్‌పై పట్టు బిగించేందుకు జూన్ నెల నుంచి రష్యా మరింత కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది. దీంతో అప్పటి నుండే ఉక్రెయిన్ పౌరులకు భారతీయులపై ఆగ్రహం పెరుగుతూ వస్తోంది. అక్కడ చదువుకుంటున్న భారతీయులను దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా ఉక్రెయిన్ పౌరులు డిమాండ్ చేస్తున్నారు.  

రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత అక్కడ రక్షణ కరువైన నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి 18000 మంది భారతీయ విద్యార్థులను అక్కడి నుండి ఖాళీ చేయించి ఇండియాకు తీసుకొచ్చింది. వీళ్లలో వైద్య విద్య ను అభ్యసిస్తున్న వారే అధికులు. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇకపై తమని ఇండియాలోనో లేక మరో విదేశీ విశ్వ విద్యాలయంలోనో తమ ఉన్నత చదువులు పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరిస్తుంది అని ఆ విద్యార్థులు అందరూ భావించారు. కానీ వాస్తవానికి అలా జరగలేదు. దీంతో ఇక చేసేదేం లేక, విద్యా సంవత్సరం వృధా చేసుకోలేక ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 3,400 మంది విద్యార్థులు తమ కోర్సులను పూర్తి చేసేందుకు మళ్లీ ఉక్రెయిన్ కి తిరిగి వెళ్లారు. 

ఇదిలావుంటే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పెరుగుతున్న కొద్దీ రష్యన్లపైనే కాకుండా భారతీయులపై సైతం అక్కడి వారిలో ఆగ్రహ జ్వాలలు, అసహనం పెరిగిపోతున్నాయి. రష్యాకు మంచి మిత్రులైన మీ భారతీయులు తమ దేశంలో ఉండటానికి వీల్లేదంటూ ఉక్రెయిన్ వాసులు భారతీయులపై తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. 

ఇదే విషయంపై మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ విద్యార్థి మాట్లాడుతూ.. " నిత్యం బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నామని అన్నారు. ఉక్రెయిన్ లో దుకాణదారులు భారతీయ విద్యార్థులకు సరుకులు విక్రయించేందుకు సైతం ఆసక్తి చూపడం లేదు. హాస్టల్ కి వెళ్తే.. అక్కడ కూడా తోటి విద్యార్థులు, సిబ్బందితో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇండియన్స్ గో బ్యాక్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు " అని సదరు విద్యార్థి తమకు ఎదురవుతున్న ఆగ్రహ జ్వాలలు, అవమానాలను గుర్తుచేసుకున్నారు. 

ఇది కూడా చదవండి : Luna 25 Crashed Into Moon: చంద్రుడిపై కూలిపోయిన లూనా 25.. రష్యా ప్రయోగం ఫెయిల్

హాస్టల్లో ఒక్కోసారి నీరు సరఫరా అవడం లేదు.. ఇంకొన్నిసార్లు విద్యుత్ సరఫరా ఆగిపోతోంది. అప్పుడప్పుడు ఒకేసారి ఈ రెండూ కూడా జరుగుతున్నాయి. ఆహారం లేకుండా చేయడం కోసం వంట గది తలుపులు మూసేస్తున్నారు అని చెబుతూ ఉక్రెయిన్ లో తమకు ఎదురవుతున్న అవమానాలు, చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు. ఇలా ఐతే తాము బతికేదెలా అని ప్రశ్నిస్తున్న భారతీయ విద్యార్థులు.. తాము అకారణంగా ఇక్కడ చిక్కుకుపోయాం అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇండియాలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ పాలసీ ప్రకారం డిసెంబర్ 2021 తరువాత విదేశాల్లో వైద్య విద్య కోసం వెళ్లిన వారు ఆ తరువాత మరో విశ్వ విద్యాలయానికి తమ అడ్మిషన్ మార్చుకోవడానికి వీల్లేదు. దీంతో ఉక్రెయిన్ లో వైద్య విద్య కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు అక్కడే కోర్స్ పూర్తి చేసి రావాలనే ఉద్దేశంతో మరోసారి వెనక్కి వెళ్లి ఇలా ఇబ్బందులు పడుతున్నారు. భారత ప్రభుత్వం తమ ఇబ్బందిని అర్థం చేసుకోవాలని లేఖలు కూడా రాస్తున్నట్టు ఆ విద్యార్థులు తెలిపారు.

ఇది కూడా చదవండి : Highest Salary Paid Country: అత్యధిక జీతం చెల్లించే దేశం ఇదే.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News