ఖురాన్ బోధకుడిగా మారిన దావుద్ కుమారుడు

మోయిన్ తన తండ్రి చట్టవ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ.. శాంతి మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం

Last Updated : Nov 26, 2017, 12:18 PM IST
ఖురాన్ బోధకుడిగా మారిన దావుద్ కుమారుడు

దావూద్ ఇబ్రహీం ఎంత కరడు గట్టిన మాఫియా నాయకుడో మనకు తెలియని విషయం కాదు. అయితే దావూద్ తదనంతరం ఆయన మాఫియా సామ్రాజ్యాన్ని నడిపే వ్యక్తి ఎవరై ఉంటారన్న విషయం మీద కూడా అతని వర్గంలో చాలా మందికి ఆసక్తి ఉంది. మొన్నటి వరకు దావూద్ కూడా తన తదనంతరం ఆ బాధ్యతలను తన కుమారుడు మోయిన్ నవాజ్‌కు ఇవ్వాలని భావించాడు. అయితే ఇటీవలే మోయిన్ ఒక చిత్రమైన నిర్ణయం తీసుకోవడంతో సందిగ్ధంలో పడ్డారు దావూద్.

హింసకు, అరాచకాలకు దూరంగా ఉండే సమాజంలో తాను జీవించడానికి ఇష్టపడతానని... ఖురాన్ ఉపదేశించే మంచి సూత్రాలను నేటి యువతకు చెప్పడానికి సంకల్పిస్తానని చెప్పిన మోయిన్ ఇస్లాం ప్రబోధకుడిగా మారాడని సమాచారం. ఇస్లాం బోధనలో శిక్షణ తీసుకొని ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ మౌలానాగా కూడా ఆయన మారాడని తెలుస్తోంది. థానేలోని యాంటీ ఎక్స్టార్షన్ సెల్‌లో దావూద్ సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్‌ని పోలీసులు విచారిస్తున్నప్పుడు ఈ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చిందట. 

ఇదే విషయంపై యాంటీ ఎక్స్టార్షన్ సెల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రదీప్ శర్మ స్పందించారు. మోయిన్ తన తండ్రి చట్టవ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ.. శాంతి మార్గాన్ని ఎంచుకున్నట్లు మాకు సమాచారం అందింది అని ఆయన తెలిపారు. అయితే మోయిన్ నిర్ణయం పట్ల దావూద్ విముఖతతో ఉన్నారట. 31 ఏళ్ళ మోయిన్ దావూద్‌కి మూడవ బిడ్డ. కొన్నాళ్ళు తన తండ్రి కుటుంబ వ్యాపారాల్లో కూడా తన పాత్ర పోషించారు. అయితే గత కొంతకాలంగా విలాసాలకు దూరంగా ఉంటూ, సాధారణ జీవితాన్ని గడపాలని యోచించిన మోయిన్, ఖురాన్‌ను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించారని.. ఆ తర్వాత ఒక మౌలానాగా మారాలని నిశ్చయించుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం కరాచీలో ఒక మసీదు క్వార్టర్స్‌లో తన కుటుంబంతో సహా నివసిస్తున్నారట మోయిన్. 

Trending News