తెలంగాణలో సోనియా గాంధీ పర్యటన.. ముహుర్తం ఖరారు..!

     

Last Updated : Nov 18, 2018, 04:20 PM IST
తెలంగాణలో సోనియా గాంధీ పర్యటన.. ముహుర్తం ఖరారు..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ రానున్నారు. ఈనెల 23న మేడ్చల్ బ‌హిరంగ స‌భ‌లో ఆమె ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటినుండే కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.  ఈ నెల 23వ తేదిన సాయంత్రం 5 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్ పోర్టుకి సోనియా గాంధీ చేరుకుంటారు. అక్కడి నుండి కారులో మేడ్చల్ వెళ్తారు. తర్వాత ఆ కార్యక్రమాన్ని ముగించుకొని మళ్లీ ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోతారు. ప్రస్తుతం ఈ కార్యక్రమ ఏర్పాట్లను కాంగ్రెస్ నేత భట్టీ విక్రమార్క మొదలైనవారు పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌ 88 మంది, తెలుగుదేశం 13 మంది, తెలంగాణ జన సమితి నలుగురు, సీపీఐ ముగ్గురు అభ్యర్థులను  ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్‌ ఆరు స్థానాలకు, తెదేపా ఒక స్థానానికి, టీజేఎస్ నాలుగు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇక బీజేపీ 119 స్థానాలకు గాను.. 93 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, బహుజన  లెఫ్ట్‌ ఫ్రంట్‌ 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. 

మేడ్చల్‌లోని కెఎల్ఆర్ నగర్‌ సోనియా గాంధీ సభకు ప్రధాన వేదిక కానుంది. తెలంగాణ ఎన్నికల విషయంలో తనకంటూ ఒక ప్రణాళిక కలిగిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రంలో మూడు సభలకు హాజరు కానున్నారు.  ఈ నెల 27, 29 తేదిలతో పాటు డిసెంబరు 3వ తేదిన కూడా తెలంగాణలో జరిగే  పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఆయన ప్రసంగించనున్నారు. అలాగే కార్యకర్తలతో కలిసి తన ఆలోచనలను కూడా పంచుకోనున్నారు. సోనియా పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇటీవలే పీసీసీ ఛీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. 

Trending News