నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతుబీమా పత్రాలు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Last Updated : Aug 6, 2018, 11:00 PM IST
నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతుబీమా పత్రాలు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది రైతులకు ‘రైతు బీమా’పత్రాలను పంపిణీ చేసేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నుండి రైతు బీమా బాండ్లను రైతులకు అందజేయనున్నారు. ఆగస్టు 14 నాటికి ఈ బీమా బాండ్ల పంపిణీని పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

రైతుబంధు చెక్కుల పంపిణీ మాదిరిగానే బీమా బాండ్లను రైతులకు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని జీవిత బీమా బాండ్లను అర్హులైన రైతులకు ఇవ్వనున్నారు. ఇప్పటికే 20 లక్షలకు పైగా బీమా బాండ్లు గ్రామాలకు చేరాయని.. మిగిలిన వాటిని కూడా ఎప్పటికప్పుడు ముద్రించి, గడువులోగానే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

రైతుబంధు జీవిత బీమా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఎల్‌ఐసీకి కిస్తీ (ప్రీమియం) చెల్లించింది. ఒక్కో రైతుకు రూ.2,271.50 చొప్పున ఇప్పటి వరకు నామిని పత్రాలు సమర్పించిన 27.95 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తం రూ. 636 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఆగస్టు 15 నుంచి రైతుబంధు జీవిత బీమా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎల్‌ఐసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

27 లక్షల మంది రైతులకు ఈ నెల 14 నుంచి 2019 ఆగస్టు 13 వరకు జీవితబీమా ఉంటుంది. ఏ కారణం వల్లనైనా రైతు మరణిస్తే నామినీకి 10 రోజుల్లోగా రూ.5 లక్షల బీమా పరిహారాన్ని ఎల్‌ఐసీ అందజేస్తుందని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు.

Trending News