KCR Pickpocketer: నీటి ఎద్దడితో ఎండిన పంటల పరిశీలన కోసం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పొలం బాట కార్యక్రమంలో జేబు దొంగలు రెచ్చిపోయారు. భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో కిక్కిరిసిన జనంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అందినకాడికి దోచుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు లబోదిదోమన్నారు. దాదాపు రూ.రెండు లక్షల నగదు దాకా దొంగతనం జరగడం కలకలం రేపింది.
Also Read: Revanth Vs Bhatti: రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి.. రెండుగా చీలిన తెలంగాణ కాంగ్రెస్?
కరువుతో అల్లాడుతున్న రైతులకు భరోసానిచ్చేందుకు.. వారిని పరామర్శించేందుకు కేసీఆర్ 'పొలం బాట' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం కేసీఆర్ పర్యటించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి రోడ్డుమార్గంలో సిరిసిల్ల జిల్లాకు వెళ్లారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ గ్రామంలో పర్యటించిన సమయంలో జేబు దొంగలు రెచ్చిపోయారు. భారీగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో ఇదే అదునుగా చూసుకున్న జేబుదొంగలు రెచ్చిపోయారు. కేసీఆర్ వెంట బిజీగా ఉన్న సమయంలో జేబుదొంగలు తమ పని కానిచ్చారు.
Also Read: Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజలపై వరాల జల్లు.. పథకాలు, హామీల మొత్తం వివరాలు
కేసీఆర్ పర్యటనలో బిజీగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల జేబులు కత్తిరించారు. మొగ్దుంపూర్ సర్పంచ్ జేబులో ఉన్న రూ.25 వేలు, దురుషేడ్ ఉప సర్పంచ్ సంపత్ రావు జేబులో రూ.15 వేలు కొట్టేశారు. వీరితో పాటు మిగతా నాయకుల జేబుల నుంచి కూడా దొంగతనం చేశారని సమాచారం. బాధితులు ఇంకా గమనించనట్టు తెలుస్తోంది. కేసీఆర్ పర్యటన అనంతరం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
రైతుల కోసం కేసీఆర్ 'పొలం బాట' పట్టారు. ఇప్పటికే జనగామ, సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొగ్దుంపూర్ పర్యటన అనంతరం కేసీఆర్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేసిన అనంతరం సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్తారు. అక్కడ మిడ్ మానేరు రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. అనంతరం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ పర్యటనకు గులాబీ పార్టీ శ్రేణుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన 'పొలం బాట' ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. రైతుల కష్టాలను ఎత్తిచూపుతూ కేసీఆర్ పర్యటన సాగిస్తుండడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. కేసీఆర్ రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టడం చూసి ఇతర పార్టీలు కూడా రైతుల వద్దకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రైతులకు న్యాయం చేయాలని బీజేపీ దీక్షలు చేపట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook