మెట్రో ప్రయాణికులు ఇవి కచ్చితంగా పాటించాల్సిందే...!

Last Updated : Nov 27, 2017, 06:07 PM IST
మెట్రో ప్రయాణికులు ఇవి కచ్చితంగా పాటించాల్సిందే...!

మరి కొన్ని రోజుల్లో మెట్రో రైలు హైద్రాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మెట్రో వచ్చి ట్రాఫిక్ కష్టాలు తీర్చుతుందో లేదు తెలియదు కానీ.. రైలు ఎక్కడానికి మాత్రం బోలెడన్ని నిబంధనలు ఉన్నాయి. మెట్రో ఎక్కాలంటే ప్రయాణికులు విధిగా పాటించాల్సిన నిబంధనలు ఒక్కసారి తెలుసుకుందాం...

బ్యాగేజీ 10 కిలోలు మించకూడదు...

మెట్రో రైల్లో ప్రయాణించే సమయంలో బ్యాగేజీ తీసుకెళ్లేందుకు కొన్ని పరిమితులు విధించారు. వ్యక్తిగత బ్యాగేజీ 10 కిలోలు మించుకూడదు..బరువు దాటితే కిలోకు రూపాయి చొప్పున అదనంగా చెల్లించాలి. బ్యాగేజీ గరిష్ట బరువు 40 కిలోలు...దీన్ని మించి తీసుకెళ్లడానికి అనుమతి లేదు. మోసుకెళ్లే బ్యాగు పొడవు 60 సెంటీమీటర్లు, వెడల్పు 45, ఎత్తు 25 సెంటీమీటర్లకు  మించకూడదు.

టోకెన్ వ్యాలిడిటీ 2:30 గంటలు ...

 మెట్రో స్టేషన్‌ను పబ్లిక్ ఏరియా, ప్రైవేట్ ఏరియా, ప్లాట్‌ఫామ్‌లుగా విభజించారు. పబ్లిక్ ఏరియాలోకి ఎవరైనా వెళ్లొచ్చు. ప్రైవేటు ఏరియాలోకి వెళ్తే రైలు ఎక్కడానికి టోకెన్ తీసుకోవాలి. ప్రైవేట్ ఏరియాలో టోకెన్ తీసుకున్నాక 29 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఆలోగానే ప్లాట్‌ఫాంపైకి వెళ్లాలి. టోకెన్ తీసుకున్న 2.30 గంటలలోపే గమ్యస్థానం చేరుకోవాల్సి ఉంటుంది. 

కింద కూర్చుంటే జరిమానా ....

మెట్రోలో సీట్లు పరిమితంగా ఉంటాయి కాబట్టి  రద్దీ సమయాల్లో సీట్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాల్లో కూర్చుంటామంటే కుదరదు. ఒక వేళ అలా కూర్చేంటే జరిమానా చెల్లించుకోకతప్పదు. సీటుంటే కూర్చోవాలి. లేదంటే నిల్చోవాలి.

 నిషేధిత జాబితా : 
మెట్రో ప్రయాణ సమయంలో చేయకూడని జాబితాను మెట్రో అధికారుల సిద్ధం చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న వస్తువులను తీసుకొచ్చే వారిని రైలులోకి అనుమతించరు.
 * రైలు కోసం వేచి ఉన్నప్పుడు పసుపురంగు లైన్ దాటరాదు
* రైలు బోగీలకు నోటీసులు అంటించరాదు
* చిన్నారులను స్టేషన్ ప్లాట్ ఫామ్ పై వదిలేయరాదు
*  రైలు కోసం ప్లాట్ ఫామ్ పై పరుగెత్తరాదు
* రైళ్లలో ఆహారం, తినుబండారాలు తీసుకోకూడదు
*  రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లకూడదు
* ప్రయాణ సమయంలో డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయరాదు
* డోర్లకు ఆనుకుని నిల్చోరాదు
* స్టేషన్ పరిసరాల్లోని నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదు
* రైల్లోకి ప్రవేశించిన తర్వాత ఫొటోలు తీయరాదు 
* స్టేషన్ పరిసరాలు, బోగీల్లో ఉమ్మి వేయరాదు
* ధూమపానం,పాన్ నమలడం, ఆల్కహాల్ నిషేదం
* బోగీ డోర్లు తెరుచుకునే లేదా మూసుకునే సమయంలో వాటి మధ్య నిల్చోరాదు
* తమ స్మార్ట్ కార్డును (లేదా) టోకెన్ ను ఇతర ప్రయాణికులతో పంచుకోరాదు

ఎయిర్ పోర్టు విధించే నిబంధనలు హైద్రాబాద్ మెట్రోలోనూ అమలు పరుస్తున్నారు. అయితే ఇక్కడ అవి ఏ మేరకు సక్సె్స్ అవుతాయనేది గమనార్హం. 

Trending News