Lok Sabha Speaker Election: ఇండియా కూటమి సంచలనం.. దేశ చరిత్రలోనే తొలిసారి స్పీకర్‌ ఎన్నిక

Om Birla vs Kondikunal Suresh Lok Sabha Speaker Election Ever: స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి లోక్‌సభ స్పీకర్‌ స్థానానికి ఎన్నిక జరుగనుంది. ఎన్డీయే, ఇండియా కూటమి తరఫున ఇద్దరు అభ్యర్థులో బరిలో నిలిచారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 25, 2024, 12:58 PM IST
Lok Sabha Speaker Election: ఇండియా కూటమి సంచలనం.. దేశ చరిత్రలోనే తొలిసారి స్పీకర్‌ ఎన్నిక

Lok Sabha Speaker: స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ స్పీకర్‌కు సంబంధించి సంచలన పరిణామం జరిగింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్‌సభ స్పీకర్‌కు ఎన్నిక జరగనుంది. ఇన్నాళ్లు ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుండగా తొలిసారి ఎన్నిక తప్పడం లేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థితోపాటు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. దీంతో దేశ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Also Read: Budget 2024 25: కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.లక్షల్లో అద్భుత ప్రయోజనాలు

 

ఇటీవల 18వ లోక్‌సభ కొలువుదీరిన విషయం తెలిసిందే. లోక్‌సభకు ఎన్నికైన వారంతా ప్రమాణస్వీకారం చేశారు. గత 17వ లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరించిన బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి స్పీకర్‌ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె సురేష్‌ స్పీకర్‌ పదవికి పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్‌ వేశారు.

ఏకగ్రీవ ప్రయత్నం విఫలం
వాస్తవంగా ప్రతిపక్ష పార్టీకి స్పీకర్‌ లేదా ఉప సభాపతి అవకాశం కల్పిస్తారు. కానీ పదేళ్లలో బీజేపీ అలాంటి అవకాశం ఇవ్వలేదు. స్పీకర్‌ పదవిని బీజేపీ తీసుకోగా.. డిప్యూటీ స్పీకర్‌ పదవిని భర్తీ కూడా చేయలేదు. స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేయడం సంప్రదాయంగా వస్తోంది. కానీ ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో బోటాబోటీ సీట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వంపై ఇండియా కూటమి పోరాటం చేస్తోంది. అధికారం చేపట్టాలని మొదట ప్రతిపక్ష కూటమి ప్రయత్నాలు చేసింది. కానీ నితీశ్‌ కుమార్‌, చంద్రబాబు నాయుడు ఎన్డీయేకు మద్దతు తెలపడంతో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు.

స్పీకర్‌ పదవి ఎన్డీయే తీసుకుంటే.. డిప్యూటీ స్పీకర్‌ పదవి తమకు ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి కోరింది. అయితే ఈ ప్రతిపాదనలను ఎన్డీయే కూటమి తిరస్కరించింది. ఏకగ్రీవం కోసం ఎన్డీయే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపక్షాలతో మంగళవారం తీవ్ర చర్చలు జరిపారు. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నామినేషన్‌ గడువు ముగుస్తున్న సమయంలో అనూహ్యంగా కాంగ్రెస్‌ తన అభ్యర్థిని స్పీకర్‌ పదవికి పోటీ దింపింది. దీంతో జూన్‌ 26 అంటే బుధవారం స్పీకర్‌ స్థానానికి ఎన్నిక జరగనుంది.

చరిత్రలో
స్వాతంత్య్రానికి పూర్వం 1925 ఆగస్టు 24న నాటి సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా అప్పటి నుంచి అదే పార్లమెంట్‌గా కొనసాగుతోంది. తొలి స్పీకర్‌కు ఎన్నిక నిర్వహించగా టి.రంగా చారియర్‌, విఠల్‌ బాయ్‌ జె పటేల్‌ పోటీ పడ్డారు. ఎన్నికల్లో విఠల్‌ భాయ్‌ స్పీకర్‌గా విజయం సాధించారు. 1925-46 మధ్య ఆరుసార్లు స్పీకర్‌ పదవికి ఎన్నికలు జరిగాయి. 1947లో స్పీకర్‌గా ఎన్నికైన జీవీ మౌలాంకర్‌ ఆ తర్వాత స్వతంత్ర భారతదేశ పార్లమెంట్‌కు కూడా స్పీకర్‌గా కొనసాగారు. అయితే ఆ తదనంతరం భారతదేశంలో స్పీకర్‌ స్థానానికి ఎన్నిక జరగలేదు. సంప్రదాయంగా స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నికవుతూనే వచ్చారు. కాగా స్పీకర్‌ పదవిని ఏఏ అయ్యంగార్‌, జీఎస్‌ థిల్లాన్‌, బలరాం జాఖడ్‌, తెలుగు వ్యక్తి జీవీఎంసీ బాలయోగి రెండు సార్లు స్పీకర్‌గా కొనసాగారు.

విప్‌ జారీ?
స్పీకర్‌ స్థానానికి ఎన్నిక అనివార్యం కావడంతో వెంటనే పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. తమ పార్టీ సభ్యులకు విప్ జారీ అవకాశం ఉంది. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సభ్యులు స్పీకర్‌ ఎన్నికలో పాల్గొంటారు. విప్‌ జారీ చేస్తే పార్టీ అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇతర అభ్యర్థికి వేస్తే వారి లోక్‌సభ సభ్యత్వం రద్దవుతుంది. లోక్‌సభలో ఎన్డీయే కూటమి అతి తక్కువ మెజార్టీ ఉండడంతో దానిని అస్త్రంగా చేసుకుని ఇండియా కూటమి స్పీకర్‌ ఎన్నిక ఎత్తును ఎంచుకుంది. క్రాస్‌ ఓటింగ్‌ను నమ్ముకున్న ఇండియా కూటమి స్పీకర్‌ పదవిని దక్కించుకోవాలనే కసితో ఉంది. కాగా ఎన్డీయే కూటమి తమ స్పీకర్‌ స్థానాన్ని తిరిగి తగ్గించుకునేందుకు రంగంలోకి దిగింది. తమ కూటమి సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ కూడా క్రాస్‌ ఓటింగ్‌ చేయకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది.

Trending News