తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ సత్తా చాటుతోంది. నేటి ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి గులాబీ పార్టీ జోరు కొనసాగిస్తోంది. వరుసగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు టీఆర్ఎస్ సొంతం చేసుకోవడంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేస్తున్న టీఆర్ఎస్ పార్టీ విజయంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని తెలంగాణ ప్రజలు మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.
‘ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో టీఆర్ఎస్‌కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టీఆర్ఎస్‌కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు’ తెలపుతూ హరీష్ రావు ట్వీట్లు చేశారు. ముఖ్యంగా కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ టీఆర్ఎస్ విజయం సాధించడం గమనార్హం.
భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకోగా, మరోవైపు బీజేపీ సైతం బోణీ కొట్టింది. ఆమన్ గల్ మున్సిపాలిటీలో బీజేపీ విజయం సాధించింది. కాగా, ఈ 22న రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు మొదలైంది. మొత్తం 2619 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్ల సంఖ్యను బట్టి 5 నుంచి 24 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
కేసీఆర్, కేటీఆర్‌లకు అభినందనలు: హరీష్