Auto Drivers: ఆటో డ్రైవర్లకు శుభవార్త.. త్వరలోనే తీపి కబురు ఉంటుందని ప్రకటన

Free Bus Effect: అధికారంలోకి వచ్చాక తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న 'మహాలక్ష్మి' పథకంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో దిగాలుపడిన ఆటో డ్రైవర్ల విషయమై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఆటో కార్మికులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ట్రాక్‌లో పడొద్దని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 06:52 PM IST
Auto Drivers: ఆటో డ్రైవర్లకు శుభవార్త.. త్వరలోనే తీపి కబురు ఉంటుందని ప్రకటన

Telangana Auto Drivers: ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. మహాలక్ష్మి పథకం అమలుతో ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు అండగా నిలబడాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్‌ కుటుంబాలకు భరోసా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ సంఘం నాయకులతో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ద ప్రకాశ్‌తో కలిసి మంత్రి ఆటో డ్రైవర్ల సమస్యలు విన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 'మహాలక్ష్మి' పథకం ద్వారా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించినట్లు మంత్రి ఆటో డ్రైవర్లకు తెలిపారు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆటో డ్రైవర్లకు  న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

ప్రయాణికుల వద్దకు బస్సులు వెళ్లవని  బస్సుల వద్దకే ప్రయాణికులు వస్తారని, ఆటోల్లొ కూడా ప్రజలు ప్రయాణం చేస్తున్నారని మంత్రి ప్రభాకర్‌ తెలిపారు. వాస్తవం అలా ఉంటే బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారి ట్రాక్‌లో మీరు పడ్డద్దని ఆటో డ్రైవర్లకు సూచించారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు భారీగా సంభవిస్తున్నాయని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలని తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం రాయితీ ఇచ్చామని గుర్తు చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు అనేది తమ విధానమని, ఆటో కార్మికులకు తాము వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

సమావేశంలో ఆటో యూనియన్ నాయకులు కూడా తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. మంత్రి, రవాణా శాఖ కమిషనర్‌కు తమ సమస్యలను విన్నవించారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించినట్లు గా ఈఎస్ఐతో కూడిన ఆటో మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని తెలిపారు. ఆటో మీటర్ చార్జీలను పెంచాలని, బీమా ప్రభుత్వం చెల్లించాలని మంత్రికి విన్నవించారు. చేనేత, కల్లుగీత  కార్మికులకు ఇస్తున్నట్టు 50 సంవత్సరాలు దాటిన ఆటో డ్రైవర్లకు కూడా పింఛన్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఓలా, ఉబర్‌ టూవీలర్లపై ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అక్రమంగా నడుస్తున్న ఓలా, ఉబెర్ టూ వీలర్లను నిషేధించాలని ఆటో యూనియన్‌ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. వీటన్నిటిని పరిశీలించి ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆటో డ్రైవర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ భరోసా ఇచ్చారు.

ఉచిత బస్సుతో కుదేలు
కాగా, రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలుతో ఆటో డ్రైవర్లకు భారీ నష్టం ఏర్పడింది. నిత్యం ప్రజలతో కిటకిటలాడే ఆటోలు వెలవెలబోతున్నాయి. గిరాకీ లేక ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం రద్దు చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలకు డిమాండ్‌ రాక ఇబ్బందులు ఎదుర్కొన్న ఇద్దరు ఆటో డ్రైవర్లు బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులతో సమావేశమైంది. సమావేశంలో చర్చించిన విషయాలను త్వరలోనే సీఎం దృష్టి తీసుకెళ్లనున్నారు. సీఎం నిర్ణయం కోసం ఆటో డ్రైవర్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

Also Read: Boat Accident: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం 16 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News