KCR: గుర్రాన్ని వదిలి ప్రజలు గాడిదను తెచ్చుకున్నారు: రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్‌ ఎద్దేవా

KCR Welcomes RS Praveen Kumar: మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిక సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులకు భరోసానిస్తూనే ప్రస్తుత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 18, 2024, 09:26 PM IST
KCR: గుర్రాన్ని వదిలి ప్రజలు గాడిదను తెచ్చుకున్నారు: రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్‌ ఎద్దేవా

KCR Speech: అధికారం కోల్పోవడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పద్నాలుగేళ్లు రాష్ట్ర సాధన కోసం పదేళ్లు ప్రగతి సాధన కోసం తన ఉద్యమం సాగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు నమ్మి ప్రజలు అటు వెళ్లారని.. ఇప్పుడు వారికి వాస్తవం అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ఒకసారి ఓడితే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండాలని తెలిపారు.

Also Read: TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్‌ ఖాళీ చేసిన తమిళిసై

 

ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో సోమవారం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా వేసి ఆహ్వానించిన కేసీఆర్‌ ఈ సందర్భంగా పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. బహుజనుల విషయమై మాట్లాడుతూనే అసెంబ్లీ ఎన్నికల ఓటమి పరిస్థితులపై మాట్లాడారు. 'దళిత బంధు పథకం దెబ్బతీసిందనే ఆలోచన సరికాదు' అని కొట్టిపారేశారు. దళిత బంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయని చెప్పారు. దళిత సమాజం ఈ పథకాన్ని ఎందుకు సానుకూలంగా తీసుకోలేకపోయిందో బహుజన యువ మేధావులు విశ్లేషించాలని తెలిపారు. బహుజనుల్లో సామాజిక చైతన్య స్థాయిని మరింతగా పెంచాల్సి ఉన్నదని గుర్తుచేశారు. 

Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం

 

'పాలకుల మీద ఐకమత్యంతో పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలే. కలగలిసి పోవాలంటే ఏం చేయాలో ఆలోచన చేయాలి. అగ్రవర్ణాల్లోని పేదలతో కూడా కలుపుకు పోవాలి. ప్రతీప శక్తులమీద పోరాడుతూనే కలిసివచ్చే శక్తులను కలుపుకపోవాలి. వారి శక్తిని మనం ఉపయోగించుకోవాలి. 20 శాతం ఉన్న దళితులు ఐక్యంగా నిలబడితే సాధించలేనిదే మీ లేదు' అని కేసీఆర్‌ చెప్పారు. రాజకీయాల్లో అనేక కష్టాలు వస్తాయి. తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలి. దేశానికే ఆదర్శంగా మన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినం' అని గుర్తు చేశారు.

ఉద్యమ కాలాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్‌.. 'తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నేను తిన్న తిట్లు ఎవరూ తినలే. నా మీద దండకాలు కూడా రాసిండ్రు. ఎన్ని కష్టాలెదురైనా ప్రలోభాలు పెట్టినా తెలంగాణ వాదాన్ని వదల్లేదు. అవసరమైన పంథాను ముందుపెట్టి తెలంగాణ కోసం పోరాటం లో కేంద్రాన్ని గజ్జున వణికించినం. శూన్యం నుంచి సుడిగాలిని సృష్టించినం. గిటువంటి సమస్యలెన్నో చూసినం ఇదో లెక్కగాదు. మీలాంటి యువత నాయకత్వం ఎదిగితే.. ఈ చిల్లర వచ్చిపోయే వాళ్ల ఇట్లాంటి స్వార్థ పరుల అవసరం ఉండదు' అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల వరకు మీరంతా నాయకులుగా ఎదగాలని సూచించారు.

'దేశంలో ఇంతవరకూ దళిత బంధు వంటి పథకం ఎవరూ తీసుకురాలేదు. అనేక చర్చలు మేధోమథనం తర్వాత రైతుబంధు తీసుకువచ్చాం. సాగునీటి ప్రాజెక్టులను తెచ్చినం తద్వారా రాష్ట్రంలో మూడు కోట్ల టన్నులకు ధాన్యం ఉత్పత్తి చేరుకుంది' అని కేసీఆర్‌ గుర్తు చేశారు.

'నాటి ఉద్యమ కాలంలో  అనివార్యంగా కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప ఎట్లబడితే అట్లా అసభ్యంగా బూతు మాటలు మాట్లాడలేదు. పరుష పదాలతో దురుసు మాటలతో తిట్టలేదు' అని వివరించారు. 'ప్రజా జీవితం అన్నప్పుడు ఓడినా గెలిచినా ఒకేలా ఉండాలే. మన ప్రజలు మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకుసాగాలి. అధికారం ఉంటే ఒకతీరు లేకుంటే మరో తీరు ఉండొద్దు' అని సూచించారు.

'అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది. ఇవి ఎక్కడ పోవు. వచ్చేటాయన ఎక్కువ ఇస్తాడనే ఆశకు పోయి మోసపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు నమ్మి అటు మళ్లారు. ఇప్పుడు ప్రజలకు అర్థమైతున్నది వాస్తవం. ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు. గాడిద వెంట పోతేనే గదా గుర్రాల విలువ తెలుసుద్ది' అని ప్రస్తుత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై వ్యంగ్యాంస్త్రాలు సంధించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News