వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టీ20 టోర్నీకి రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, భవనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు విశ్రాంతి తీసుకోనున్నారు. తీరకలేక ఆడుతున్న వీరందరికీ రెస్టు దొరకడంతో.. టీం ఇండియాలో కొత్త ముఖాలకు చోటు దక్కనుంది.
గతేడాది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సిరీస్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా జట్టు రెండింటిలో విజయం సాధించి, ఒకదాంట్లో ఓడింది. అయినా శర్మ సిరీస్ విజయాన్ని తెచ్చిపెట్టాడు.
భారత జట్టు గత కొన్ని నెలలుగా విశ్రాంతి లేకుండా వరుసగా క్రికెట్ మ్యాచులు ఆడుతోంది. జనవరి నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ, ఆటగాళ్ల మధ్య పరస్పర అంగీకారంతో ఈ ఐదుగురు ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. వీరి స్థానాలను యువ ఆటగాళ్లతో భర్తీ చేయబోతున్నారు. వికెట్ కీపర్ ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కొత్త వారిని ఎంపిక చేసేందుకు సెలక్టర్లు నేడు సమావేశం కానున్నారు.