బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం.. శభాష్ అనిపించుకున్న బౌలర్లు

 ఈ విజయంతో ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ ఖాతా తెరిచినట్టయింది. 

Last Updated : Mar 9, 2018, 12:55 AM IST
బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం.. శభాష్ అనిపించుకున్న బౌలర్లు

కొలొంబోలో గురువారం జరిగిన టీ20 మ్యాచ్‌ను భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఈ విజయంతో ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ ఖాతా తెరిచినట్టయింది. తొలుత బౌలర్లు సమష్టి కృషి చేసి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టించగా ఆ తర్వాత రంగంలోకి దిగిన బ్యాట్స్‌మెన్‌ కూడా పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో ఆడటంతో విజయం టీమిండియా వశమైంది. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ 55 (43బంతుల్లో 5×4, 2×6), సురేశ్‌ రైనా 28 (27బంతుల్లో; 1×4, 1×6), మనీశ్‌ పాండే 27 (19బంతుల్లో; 3×4) నిలకడగా ఆడి బంగ్లాదేశ్‌ నిర్ధేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించారు. ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 17 (13బంతుల్లో; 3×4) తన వైఫల్యాన్ని అధిగమించలేకపోయాడు. 3వ ఓవర్‌లో ముస్తాఫిజర్‌ విసిరిన 3వ బంతికి టీమిండియా కెప్టెన్ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో తేలిపోయిన భారత్ బౌలర్లు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయారు. పేస్‌ బౌలర్‌ జయ్‌దేవ్‌ ఉనద్కత్‌ (3/38)తో రాణించగా, ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌( 2/32) బంగ్లాదేశ్‌ ఆటగాళ్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు. శార్దూల్‌ ఠాకూర్‌, చాహల్‌ సైతం అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ తక్కువ పరుగులకే పరిమితమయింది. ఒకవిధంగా టీమిండియా విజయానికి ఇక్కడే బాటలు పడ్డాయి. టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్‌ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేయగలిగారు. 

ఇదంతా ఇలా వుంటే, భారత ఫీల్డర్లు నాలుగైదు క్యాచ్‌లు వదిలేయడం, బౌలర్లు కూడా ఎక్స్‌ట్రాల రూపంలో ఇంకొన్ని పరుగులు సమర్పించుకోవడం కారణంగానే బంగ్లా ఆ మొత్తం స్కోర్ అయినా సాధించడానికి మార్గం సుగుమమైంది. లేదంటే ఇంకా తక్కువ పరుగులకే బంగ్లా చాప చుట్టేసి వుండేది. 

Trending News