CSK vs GT IPL 2023 Final: నేడు ఐపీఎల్ 2023లో కీలక సమరం జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్ ఆరంభంలో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన చెన్నై.. క్వాలిఫైయర్ 1లో గుజరాత్‌ను ఓడించి నేరుగా ఫైనల్ చేరింది. మరోవైపు సీజన్ ఆరంభం నుంచి విజయాలు సాధించిన గుజరాత్.. క్వాలిఫైయర్ 1లో చెన్నై చేతిలో ఓడిపోయింది. రెండు జట్లు ఫామ్ మీదున్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ప్రస్తుత సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్ శుభ్‌మన్ గిల్. గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకోవడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. లీగ్ స్టేజ్‌లో బెంగళూరుపై, రెండో క్వాలిఫయర్‌లో ముంబైపై సెంచరీలు చేశాడు. 851 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. నేడు చెన్నైతో ఫైనల్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడుతాడని అందరూ అభిప్రయపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్లపై సెంచరీలు చేసిన గిల్.. ఫైనల్‌లోఎంఎస్ ధోనీ జట్టుపై కూడా రాణిస్తాడన్నాడు. ఐదో టైటిల్ సాధించాలని చూస్తున్న చెన్నైకి అతడు అడ్డంకిగా మారే అవకాశం ఉందన్నాడు.
ఓ జాతీయ మీడియాతో అతుల్ వాసన్ మాట్లాడుతూ... 'దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను శుభ్‌మన్ గిల్ దాటేస్తాడు. గిల్ బ్యాటింగ్ విధానం అద్భుతంగా ఉంది. ఇప్పటికే కోహ్లీ, రోహిత్ జట్లపై సెంచరీలు చేశాడు. ఇప్పుడు ధోనీ వంతు వచ్చింది. చెన్నై పైనా సెంచరీ సాధించగలడు. గుజరాత్ జట్టుకు అత్యుత్తమ బౌలింగ్, బ్యాటింగ్ ఉంది. సూర్యకుమార్ యాదవ్ వంటి ప్రమాదకరమైన ఆటగాడిని కూడా వారు అడ్డుకున్నారు. డెత్ బౌలింగ్‌లో గుజరాత్‌కు తిరుగులేదు. చెన్నైలోనూ బ్యాటింగ్, బౌలింగ్ బాగుంది. అయితే గిల్‌ను ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి' అని అన్నాడు.
'డబ్బు, కీర్తి వచ్చిన తర్వాత ఆటపై దృష్టిపెట్టడం చాలా కష్టమవుతుంది. కానీ శుభ్‌మన్ గిల్ విషయంలో మాత్రం అలా జరగలేదు. గిల్ చిన్న పట్టణం నుంచి వచ్చాడు. కుమారుడికి క్రికెట్‌ను కెరీర్‌గా మార్చడానికి అతడి తండ్రి చాలా త్యాగాలు చేశాడు. అందుకే ఐపీఎల్‌లో భారీ మొత్తం సంపాదించినా ఇప్పటికీ గిల్ బాడీ లాంగ్వేజ్ మారలేదు. అతడు పెద్ద స్టార్ అవుతాడు' అని అతుల్ వాసన్ చెప్పుకొచ్చాడు. 2010, 2011, 2018, 2021 సీజన్లలో చెన్నై టైటిళ్లు గెలుపొందిన విషయం తెలిసిందే. 2022లో గుజరాత్ టైటిల్ గెలిచింది.
Also Read: Simple One Electric Scooter: సింపుల్ వన్ ఈవీ వచ్చేసింది.. సింగిల్ ఛార్జింగ్‌పై 212 కిమీ ప్రయాణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.