దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో టెస్టు మిగిలి ఉండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు, ఈ విజయంతో భారత్ ఓ సరికొత్త ప్రపంచ రికార్డు సాధించింది. సొంతగడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 11వ విజయం. ఇప్పటివరకు 10 విజయాలతో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఈ దెబ్బతో రెండో స్థానంలోకి జారుకుంది. 1994-2001, 2004-2008 మధ్య కాలంలో ఆస్ట్రేలియా రెండుసార్లు వరుసగా పది టెస్టు విజయాలు సాధించి అప్పట్లో రికార్డు సృష్టించగా... ఇప్పుడు 11 విజయాలతో భారత్ ఆ రికార్డును బద్దలుకొట్టింది.
గతంలో ధోనీ కెప్టెన్సీలో ఇలా ఇన్నింగ్స్ పరుగుల తేడాతో భారత జట్టు తొమ్మిదిసార్లు గెలవగా కోహ్లీ కెప్టేన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టును ఇలా గెలిపించడం ఇది 8వ సారి కావడం విశేషం. అంతేకాకుండా కెప్టెన్‌గా జట్టుకు అత్యధిక విజయాలు అందించిన క్రికెటర్ల జాబితాలోనూ విరాట్ కోహ్లీ మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 50 టెస్టులకు కెప్టేన్సీ వహించిన కోహ్లీ 30 మ్యాచ్‌ల్లో విజయం అందించాడు. కెప్టేన్‌గా అత్యధిక విజయాలు అందించిన వారి జాబితాలో 37 మ్యాచ్‌ల విజయంతో స్టీవా, 35 మ్యాచ్‌లతో రికీ పాంటింగ్ మొదటి, రెండో స్థానాల్లో ఉన్నారు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 19 నుంచి రాంచీలో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులోనూ కోహ్లీ సేన విజయం సాధిస్తే, భారత జట్టు, వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీ విజయ పరంపర, రికార్డులు ఇంకొంత పెరగడం ఖాయం.