India Vs Australia Highlights: ఫైనల్‌ ఫైట్‌లో టీమిండియా బోల్తా.. విశ్వవిజేతగా ఆసీస్

IND Vs AUS ICC World Cup 2023 Final Full Highlights: వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్‌ ఫైట్‌లో భారత్‌ను చిత్తుచేసి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అన్ని రంగాల్లో విఫలమైన రోహిత్ సేన.. చివరి మెట్టుపై బోల్తా కొట్టింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 19, 2023, 11:30 PM IST
India Vs Australia Highlights: ఫైనల్‌ ఫైట్‌లో టీమిండియా బోల్తా.. విశ్వవిజేతగా ఆసీస్

IND Vs AUS ICC World Cup 2023 Final Full Highlights: 140 కోట్ల మంది భారతీయులు ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు చల్లింది. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షా 30 వేల మందిని మూగవోయేలా చేసింది. వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత్‌పై గెలుపుతో ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఫైనల్‌కు చేరిన రోహిత్ సేన.. ఆఖరి పోరులో మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమై కప్‌ను చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66), రోహిత్ శర్మ (47) రాణించారు. అనంతరం ఆసీస్ 43 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి టార్గెట్ పూర్తిచేసింది. ట్రావిస్ హెడ్ (137) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు లబూషేన్ (58) చరిత్రలో గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ట్రావిస్ హెడ్‌కే దక్కింది. ఫైనల్ మ్యాచ్‌లో ఓటమితో టీమిండియా ఆటగాళ్లు స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. 

టీమిండియా విధించిన 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే బిగ్‌ షాక్ తగిలింది. డేవిడ్ వార్నర్ (7), మిచెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. వార్నర్‌ను షమీ ఔట్ చేయగా.. మార్ష్, స్మిత్ వికెట్లను బుమ్రా పడగొట్టాడు. దీంతో 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడం.. టీమిండియా బౌలర్ల జోరు చూస్తే మ్యాచ్‌ మనదే అనిపించింది. అయితే ఇక్కడే మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు జత కలిసిన లబూషేన్ భారత్ బౌలర్లను కాచుకున్నాడు.

ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడినా.. సహనంతో క్రీజ్‌లో పాతుకుపోయేందుకు ప్రయత్నించారు. షమీ, బుమ్రా బుల్లెట్ లాంటి బంతులు సంధించినా.. వికెట్‌ను కాపాడుకున్నారు. ఆ తరువాత మంచు కురవడం.. పిచ్‌ నుంచి ఏ మాత్రం సహకారం లేకపోవడంతో బౌలర్లు తేలిపోయారు. సెట్ అయిన తరువాత ట్రావిస్ హెడ్ బ్యాట్ ఝులిపించాడు. వేగంగా ఆడుతూ లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. లబూషేన్ చక్కగా సహకరించాడు. హెడ్‌ (120 బంతుల్లో 137, 15 ఫోర్లు, 4 సిక్సర్లు), లబూషేన్ (110 బంతుల్లో 58, 4 ఫోర్లు) అద్భుతంగా రాణించారు. విజయానికి రెండు పరుగుల దూరంలో హెడ్ ఔట్ అవ్వగా.. మ్యాక్స్‌వెల్ విన్నింగ్ షాట్ కొట్టాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్ చెరో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్ (4) వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి గిల్ ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ (31 బంతుల్లో 47, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడినా.. ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. కీలకపోరులో యాథావిధిగా భారీ షాట్‌కు యత్నించి మాక్స్‌వెల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికి స్కోరు  9.4 ఓవర్లలో 76 పరుగులుగా ఉంది. కాసేపటికే శ్రేయాస్ అయ్యర్‌ (4) కమిన్స్ ఔట్ చేయడంతో టీమిండియా కష్టాల్లో పడిపోయింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరు జట్టును ఆదుకున్నారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు.

హాఫ్ సెంచరీ తరువాత విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 54, 4 ఫోర్లు)ను కమిన్స్ ఔట్ చేయడంతో భారీ స్కోరు ఆశలకు గండిపడింది. రవీంద్ర జడేజా (9) తక్కువ స్కోరుకే ఔట్ అవ్వడంతో మరో దెబ్బ పడింది. క్రీజ్‌లో పాతుకుపోయిన కేఎల్ రాహుల్ (107 బంతుల్లో 66, ఒక ఫోర్) కూడా కీలక సమయంలో పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు. ఫైనల్‌ పోరులో అయినా మెరుపులు మెరిపిస్తాడని సూర్యకుమార్ యాదవ్ (18)పై ఎన్నో ఆశలు పెట్టుకోగా.. దారుణంగా నిరాశపరిచాడు. షమీ (6), బుమ్రా (1) తక్కువస్కోర్లకు ఔట్ అవ్వగా.. కుల్దీప్ (10), సిరాజ్ (9) జట్టు స్కోరును 240కి చేర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టగా.. పాట్ కమిన్స్, జోష్‌ హేజిల్‌వుడ్ తలో రెండు తీశారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, జంపాకు చెరో వికెట్‌ దక్కింది. 

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News