Rohit Sharma: రోహిత్ శర్మకు గాయం.. ఆసుపత్రికి తరలింపు

Rohit Sharma Injured In Ind Vs Ban 2nd Odi: బంగ్లాదేశ్‌తో కీలక పోరులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో వెంటనే మైదానాన్ని వీడాడు. స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2022, 01:17 PM IST
Rohit Sharma: రోహిత్ శర్మకు గాయం.. ఆసుపత్రికి తరలింపు

Rohit Sharma Injured In Ind Vs Ban 2nd Odi: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో హిట్ మ్యాన్ చేతి వేలిని బంతి బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిలాడుతున్న రోహిత్ శర్మకు వెంటనే సిబ్బంది చికిత్స అందించారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. కెప్టెన్ గాయంపై టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రోహిత్ శర్మ మైదానాన్ని వీడడంతో.. రజత్ పటీదార్ ఫీల్డింగ్‌కు వచ్చాడు. హిట్ మ్యాన్‌ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 

ఇప్పటికే సిరీస్‌లో 1-0 వెనుకబడ్డ టీమిండియాకు ఈ మ్యాచ్‌ చావోరేవోగా మారింది. కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ గాయపడటం కలవరపెడుతోంది. హిట్ మ్యాన్ గాయం తీవ్రమైతే.. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే.. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. రెండో వన్డేలో బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

 

అయితే బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం తప్పని భారత బౌలర్లు నిరూపించారు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బంగ్లాను తొలి దెబ్బ కొట్టాడు. తన తొలి ఓవర్ 5వ బంతికి అనముల్ హక్ (11)ను ఎల్బీడబ్ల్యూ అవుట్ చేశాడు. హక్ 9 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 11 పరుగులు చేశాడు. ఆ తరువాత ఇన్నింగ్స్ 10వ ఓవర్ రెండో బంతికి లిటన్ దాస్ (7)ను బౌల్డ్ చేసి మహ్మద్ సిరాజ్ బంగ్లాను మళ్లీ దెబ్బతీశాడు. ఈసారి యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియాకు మరో వికెట్ అందించాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి నజ్ముల్ హసన్ శాంటో (21)ను బౌల్డ్ చేశాడు. గంటకు 151 కి.మీ వేగంతో బంతికి స్ట్రెయిట్ బెయిల్స్ చెల్లాచెదురు అయ్యాయి. షకీబ్‌ అల్‌ హసన్‌ (8) రూపంలో బంగ్లాదేశ్‌కు నాలుగో దెబ్బ తగిలింది. 

ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ చివరి బంతికి షకీబ్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ పెవిలియన్‌కు పంపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో వాషింగ్టన్ బంగ్లాను మళ్లీ కోలుకోలేని దెబ్బ తీశాడు. ముష్ఫికర్ రహీమ్ (12), అఫీఫ్ హుస్సేన్ (0)లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 20 ఓవర్లో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

 

Trending News