గోవా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యంసేవిస్తే జరిమానా విధించాలని నిర్ణయించింది. దానికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. గోవాలో ఆగస్టు 15 నుండి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే రూ.2500 ఫైన్ వేస్తామని సీఎంమనోహర్ పారికర్ వెల్లడించారు.
సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న పారికర్ ‘ఆగస్టు నుంచి బహిరంగంగా మద్యం సేవిస్తే భారీ జరిమానాలు ఉంటాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తాం. ఆగస్టు15 నుంచి ఈ విధానం అమలులోకి తెస్తాం’ అని స్పష్టంచేశారు. ఇక మీదట ఎక్కడపడితే అక్కడ ఖాళీ బీర్ బాటిల్స్ ను విసరడం కూడా నిషేధం అని తెలిపారు. పనాజీలో కాలేజీ విద్యార్థులు బీర్లు తాగుతూ కనిపించడం తనను కలవరపెట్టిందన్న ఆయన.. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజం అని, పర్యాటకులను ఆకర్షించడం కోసం కఠిన నిర్ణయాలు తప్పవని అన్నారు. బీచులన్నీ శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీచుల్లో మద్యం సేవిస్తూ కనిపించిన వారిపై ఇప్పటికే పోలీసులు కేసులు కూడా నమోదుచేసినట్లు..వారికి భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇందుకోసం టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్‌లో కొన్ని సవరణలు చేస్తున్నామని, పోలీసులకు మరిన్ని అధికారాలు ఇస్తున్నామని గతంలో గోవా ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే.
గతంలో పారికర్ ఓ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ మధ్య అమ్మాయిలు కూడా బీర్లు తాగుతున్నారని, ఇది మంచిది కాదని అన్నారు. దీనిపై అప్పట్లో వివాదం చెలరేగింది.