Kaikala Satyanarayana Last Wish Not fulfilled: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తెల్లవారు 4 గంటలకు కన్నుమూశారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో సుమారు 800 పైగా సినిమాల్లో నటించిన ఆయన చిరంజీవితో మాత్రం ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. చిరంజీవి సమకాలీకులైన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరితోనూ కైకాల సత్యనారాయణ నటించినా ఎక్కువగా చిరంజీవితోనే సాన్నిహిత్యం ఉండేది.
అందుకే చిరంజీవి కూడా తరచూ కైకాల సత్యనారాయణ ఇంటికి వెళుతూ ఉండేవారు. వయసు పై పడడంతో సినిమాలు దూరమైన సమయంలో కూడా కైకాలకు చిరంజీవి అండగా నిలబడుతూ ఉండేవారు. అందుకే గత ఏడాది ఈ ఏడాది ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా చిరంజీవి స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి జరిపించారు. ఆయన బెడ్ మీద ఉండగానే చిరంజీవి స్వయంగా ఇంటికి కేక్ తీసుకెళ్లి కట్ చేయించి మరీ శుభాకాంక్షలు చెప్పడమే కాక వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా చిరంజీవి, కైకాల సత్యనారాయణ మృతితో తీవ్ర విషాదంలో మునిగి పోయినట్లు వెల్లడించారు. ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం నాకు దక్కిందంటూ చిరంజీవి పేర్కొన్నారు. డైలాగులు చెప్పడంలో ఆయనది ప్రత్యేక స్టైల్ అని నిష్కల్మషమైన మనసున్న మంచి మనిషి ఎలాంటి అమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పే వారని తనను తమ్ముడు అంటూ తోడబుట్టిన వాడిలా ఆదరించారని మెగాస్టార్ పేర్కొన్నారు.
అలాగే ఆయనకు నటన, రుచికరమైన భోజనం అంటే రెండూ ప్రాణమని, నా భార్య సురేఖ చేతి వంటను ఎంతో ఇష్టంగా తినేవారని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం తనకు మిగిలిన సంతృప్తిగా మెగాస్టార్ అభివర్ణించారు. ఇదే సందర్భంగా కైకాల సత్యనారాయణ మెగాస్టార్ భార్యను వంట చేసి పంపించమనడం దానికి ఆమె అందరూ కలిసి భోజనం చేద్దాం అని చెప్పడం కూడా మెగాస్టార్ పంచుకున్నారు.
సురేఖమ్మా మీ చేతితో వండిన ఉప్పు చేప పంపించండి అన్నప్పుడు మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దామని చెప్పామని, ఆ క్షణాన ఆయన చిన్నపిల్లాడిలా ఎంతో సంతోషపడ్డారని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. అయితే ఒక రకంగా అప్పటి నుంచి కూడా కైకాల సత్యనారాయణ మంచానికే పరిమితమై ఉండడంతో మెగాస్టార్ సతీమణి సురేఖ వండిన ఉప్పు చేప కైకాల సత్యనారాయణ తినలేకపోయారు. అలా ఒకరకంగా ఆయన చివరి కోరిక తీరలేదని చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి కైకాల సత్యనారాయణ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కైకాల యముడుగా నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు సినిమాలు ఇద్దరికి మంచి క్రేజ్ తీసుకు వచ్చాయి. అవి మాత్రమే కాదు, స్టేట్ రౌడీ, కొదమ సింహం, బావగారు బాగున్నారా, ఇలాంటి సినిమాలు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. మరీ ముఖ్యంగా రుద్రవీణ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు సినిమాల్లో కూడా ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
Also Read: Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ కన్నుమూత.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
Also Read: Raviteja Dhamaka Review: రవితేజ ధమాకా సినిమా ఎలా ఉంది? రివ్యూ - రేటింగ్ మీకోసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
చిరంజీవిని కోరిన చివరి కోరిక తీరకుండానే చనిపోయిన కైకాల.. అదేంటో తెలుసా?