తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా విడుదల అవుతుందంటే… ఓ నెల ముందు నుంచే హంగామా మొదలవ్వడం.. వారం ముందే ప్రేక్షకులు టికెట్స్ కోసం థియేటర్స్ వద్ద క్యూలు కట్టడం… రిలీజ్‌కి ముందు ఎక్కడ చూసినా.. విన్నా సూపర్ స్టార్ సినిమా గురించే మాట్లాడుకోవడం సర్వసాధారణం. కానీ ఇవన్నీ లేకుండానే రజినీకాంత్ నటించిన ‘కాలా’ సినిమా థియేటర్స్లోకొచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండానే విడుదలైన ‘కాలా’ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా… సూపర్ స్టార్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
తిరునల్వేలి నుండి ముంబైకి బతుకుతెరువు కోసం ముంబై వచ్చి, అక్కడ ధారావి అనే ప్రాంతంలో స్థిరపడిన వీరయ్య కొడుకు కరికాలా అలియాస్ ‘కాలా’… ఆ వాడకి నాయకుడిగా ఉంటూ కొన్ని కార్పొరేట్ కంపెనీల ఆగడాల నుంచి …రాజకీయ నాయకుల నుంచి క్లీన్ ముంబై పేరుతో కబ్జా అవ్వకుండా కాపాడుకుంటూ వస్తాడు. సరిగ్గా అదే సమయంలో విదేశాల నుంచి ధారావిని అభివృద్ధి చేయడానికి కాలా మాజీ ప్రియురాలు జరీన (హుమా ఖురేషి) ముంబైకి వస్తుంది. మినిస్టర్ హరిదాదా కుట్ర తెలియకపోవడంతో అతని వ్యక్తులతో కలిసి ధారావి కోసం పాటుపడుతుంది. ఇక తన కుటుంబం కంటే తాను నివసించే ధారావినే ఎక్కువగా ప్రేమించే కాలా ఓ సందర్భంలో మినిస్టర్ హరిదాదా (నానా పటేకర్)కి ఎదురెళ్తాడు. ఈ క్రమంలో తన భార్య స్వర్ణ (ఈశ్వరి రావు), అలాగే కొడుకు శివాజీ (అరవింద్ ఆకాష్)ను కూడా పోగొట్టుకుంటాడు. అవన్నీ లెక్కచేయని కాలా ధారావి కోసం అక్కడి సర్కార్‌కి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. చివరికి ఈ పోరాటంలో కాలా గెలిచాడా… లేదా అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు :
కాలా క్యారెక్టర్లో సూపర్ స్టార్ సూపర్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా మాసీ లుక్‌తో మెస్మరైజ్ చేసాడు. తన పర్ఫార్మెన్స్తో వన్ మెన్ షో అనిపించాడు రజినీకాంత్. ఈశ్వరీ రావు కాలా భార్య పాత్రలో ఒదిగిపోయింది. నానా పటేకర్ తన పాత్రకు తగిన విధంగా నటించి సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాడు. బావగా సముద్రఖని, కొడుకుగా అరవింద్ ఆకాష్ ఆకట్టుకున్నారు. నటిగా అంజలి బెస్ట్ అనిపించుకుంది. షయాజీ షిండే, సంపత్ రాజ్, ఆరుళ్ దాస్, రవి కాలే, పంకజ్ త్రిపాటి తదితరులు తమ తమ పాత్రల్లో పరవాలేదని అనిపించుకున్నారు.
టెక్నీషియన్స్ పనితీరు :
కబాలి ఫేమ్ సంతోష్ నారాయణ్ మ్యూజిక్ పరవాలేదు. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో అతని బాగ్రౌండ్ స్కోర్ సినిమాను బాగా ఎలివేట్ చేసినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వెస్టర్న్ రాప్ మ్యూజిక్‌తో చిరాకు తెప్పించాడు. ‘కాలా’ టైటిల్ సాంగ్’ , ‘రావే నా నా రంగేళి లా’,’చిట్టెమ్మా’ పాటలు మినహా మిగతా పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. రామ లింగం ఆర్ట్ వర్క్ బాగుంది. చాలా సన్నివేశాల్లో తన ఆర్ట్ వర్క్‌తో ముంబైలోని మురికివాడల లుక్ తీసుకురావడంలో రామలింగం సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. రజినిని కొత్తగా చూపించడంలో, కొన్ని షాట్స్‌లో సినిమాటోగ్రాఫర్ మురళి తన కెమెరా పనితనం చూపించాడు. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. పా.రంజిత్ స్క్రీన్ ప్లే -డైరెక్షన్ వీక్ అనిపించాయి. ధనుష్ అధినేతగా ఉన్న వండర్ బార్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌజ్ వాల్యూస్ పరవాలేదు.
ఓ స్టార్ హీరో యంగ్ డైరెక్టర్‌ను నమ్మి మరో ఛాన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ‘కబాలి’ వంటి అపజయం తర్వాత కూడా మళ్ళీ అదే దర్శకుడికి సూపర్ స్టార్ మరో అవకాశం ఇవ్వడం పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. ఫ్లాప్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ సూపర్ స్టార్ రజిని, రంజిత్ని నమ్మి మరో చాన్స్ ఇవ్వడం, ముంబైలోని మురికివాడలు, మాఫియా నేపథ్యంతో తెరకెక్కిన కథ కావడం, రజిని లుక్ ఎట్రాక్ట్ చేయడం ‘కాలా’ పై ఓ మోస్తరు అంచనలు ఏర్పడేలా చేశాయి. ఆ మోస్తరు అంచనాలతో ఎటువంటి హంగామా లేకుండానే ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది.
రంజిత్‌కి సూపర్ స్టార్ మరో ఛాన్స్ ఇచ్చినప్పుడు గత సినిమాలో చేసిన తప్పులు రిపీట్ చేయకుండా జాగ్రత్త పడాలి కానీ ఈ సినిమాలో రంజిత్ మళ్ళీ అవే తప్పులు రిపీట్ చేసాడు. ముఖ్యంగా ర్యాప్ థీమ్స్‌ను రిపీట్ చేయడం లాంటివి. పైగా రజిని ఎంట్రీ సాదా సీదా హీరో ఎంట్రీలా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాత్రమే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం అభిమానుల్ని నిరుత్సాహపరిచింది. రజిని లుక్, కొన్ని సీన్స్, ప్రీ ఇంటర్వెల్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఫస్ట్ హాఫ్ పరవాలేదనిపించిన దర్శకుడు… సెకండ్ హాఫ్‌లో మాత్రం సినిమాను కాస్త సాగదీసి బోర్ కొట్టించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి.
సినిమా గ్రాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్‌లో తన కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్న కాలా.. మినిస్టర్ దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం నుంచి సినిమా గ్రాఫ్ పడిపోయింది. అక్కడి నుంచి ఇక ఊపందుకోకపోవడం సినిమాకు పెద్ద మైనస్. కథాంశం బాగున్నప్పటికీ కథతో పూర్తి స్థాయిలో ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయలేకపోయాడు రంజిత్. కొన్ని సందర్భాల్లో దర్శకుడు సూపర్ స్టార్‌ను సరిగ్గా వాడుకోలేదేమో అనిపిస్తుంది. హీరోయిజంను ఎలివేట్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు రంజిత్. ఒక సామాజిక అంశాన్ని కమర్షియల్ కోణంలో తెరకెక్కించడంలో దర్శకుడు అక్కడక్కడా తడబడ్డాడు.
ప్లస్ పాయింట్స్ :
రజినీకాంత్
ఆర్ట్ వర్క్
ప్రీ ఇంటర్వెల్ ఫైట్
ఇంటర్వెల్ బ్యాంగ్
కొన్ని కామెడి సీన్స్
మైనస్ పాయింట్స్ :
స్లో నెరేషన్
బ్యాగ్రౌండ్ స్కోర్
సాంగ్స్
ర్యాప్ థీమ్స్
లెంత్
ప్రీ క్లైమాక్స్ – క్లైమాక్స్
రేటింగ్ : 2.75/ 5