కర్ణాటక రాజకీయాల్లో రోజుకొక రకమైన నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన జేడీఎస్ అధినేత కుమారస్వామి నేడు అసెంబ్లీలో జరగనున్న బల పరీక్షలో నెగ్గాల్సి వుంది. " అయితే, అంతకన్నా ముందుగా అసలు కుమారస్వామి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారా లేక మరొకటా అనే అంశం గురించి ఆలోచించాల్సి వుంది" అని తాజాగా ఉప ముఖ్యమంత్రి, జేడీఎస్‌కి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేత డా. జీ పరమేశ్వర చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఉప ముఖ్యమంత్రి డా. జీ పరమేశ్వర గురువారం మీడియాతో మాట్లాడుతూ "జేడీఎస్‌కి ఏయే పోర్ట్‌ఫోలియోలు ఇవ్వాలి ?, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎటువంటి పోర్ట్‌ఫోలియోలు దక్కాల్సి వుంది, అసలు కుమారస్వామినే ఈ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారా లేక కాంగ్రెస్ పార్టీకి కూడా ముఖ్యమంత్రి సీటు దక్కే అవకాశం వుందా అనే అంశాలన్నింటిపైన జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అగ్రనేతలు ఇంకా ఒక ఒప్పందానికి రావాల్సి వుంది" అని వ్యాఖ్యానించడం చర్చనియాంశమైంది.
అయితే, రాష్ట్ర ప్రజానికానికి మెరుగైన పరిపాలన, అభివృద్ధి అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, సాధ్యాసాధ్యాలపై చర్చించాకా ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో ఎవరు కొనసాగుతారు అనే అంశంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని జీ పరమేశ్వర అభిప్రాయపడ్డారు. ఏదేమైనా తాజాగా పరమేశ్వర చేసిన ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే, జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగడం కత్తిమీద సాములాంటిదే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కుమారస్వామి సీటుకు కాంగ్రెస్ తిరకాసు